Share News

ఆస్తికుడు నాస్తికుడు

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:45 AM

ఒక గ్రామంలో ఇద్దరు పండితులు ఉండేవారు. వారిలో ఒకరు ఆస్తికుడు, మరొకరు నాస్తికుడు. ఇద్దరూ చక్కటి వాక్చాతుర్యం కలిగినవారు. తమ హావభావాలతో ఎదుటివారిని ఆకర్షించి, వాదనతో మెప్పించి...

ఆస్తికుడు నాస్తికుడు

సద్బోధ

ఒక గ్రామంలో ఇద్దరు పండితులు ఉండేవారు. వారిలో ఒకరు ఆస్తికుడు, మరొకరు నాస్తికుడు. ఇద్దరూ చక్కటి వాక్చాతుర్యం కలిగినవారు. తమ హావభావాలతో ఎదుటివారిని ఆకర్షించి, వాదనతో మెప్పించి ఒప్పించగలిగే సామర్థ్యం ఉన్నవారు. ఆస్తికుడు రోజూ ఉదయాన్నే గ్రామస్తులను కలిసేవాడు. తన ప్రసంగాలతో వారిలో భగవంతుడి పట్ల విశ్వాసం పెంపొందేలా చేసేవాడు. సాయంత్రం నాస్తికుడు వారందరినీ కలిసి, తన శక్తియుక్తులన్నీ వినియోగించి... దేవుడు లేనేలేడని వారు ఒప్పుకొనేలా చేసేవాడు.

ప్రతిరోజూ ఇదే జరుగుతూ ఉండడంతో గ్రామస్తులకు దిక్కుతోచని పరిస్థితి వచ్చింది. ఆస్తికుడు చెప్పేది వింటూ ఉంటే అది నిజమనిపిస్తోంది. నాస్తికుడు చెప్పింది విన్నా ‘ఇదీ నిజమే కదా!’ అనిపిస్తోంది. అందుకే వారందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ‘రాబోయే పున్నమి రోజు రాత్రి దేవాలయం దగ్గర అందరం కలుద్దాం. ఇద్దరినీ వాదించమందాం. ఎవరు గెలిస్తే వారిని అనుసరిద్దాం. ఈ అవస్థ తప్పుతుంది’ అనుకున్నారు. ఈ విషయాన్ని ఆస్తికుడికీ, నాస్తికుడికీ తెలియజేశారు. వారు కూడా అందుకు అంగీకరించారు.

పున్నమి రాత్రి రానే వచ్చింది. ఊరి ప్రజలు ఆలయం దగ్గరకు ఉత్సాహంగా చేరుకున్నారు. ఆస్తికుడు, నాస్తికుడు కూడా సిద్ధమై వచ్చారు. వాదన మొదలయింది. అది రాత్రంతా కొనసాగింది. ఆస్తికుడు ఎన్నెన్నో శాస్త్రాలను, పండితుల అభిప్రాయాలను ప్రస్తావించాడు. వీనుల విందు కలిగేలా పాటలు పాడాడు, పద్యాలు చెప్పాడు. నాస్తికుడు కూడా తన మేధాశక్తిని బాగా వినియోగించి, ప్రపంచంలోని అనేక సంఘటనలను సోదాహరణంగా వినిపించి, చక్కటి వాగ్ధాటితో, సంభాషణా చాతుర్యంతో తను చెప్పాల్సినవన్నీ చెప్పాడు. తెల్లవారింది. ఇంతకీ ఆ సమావేశం ఫలితం ఏమిటంటే... నాస్తికుడు చెప్పినదంతా విన్న ఆస్తికుడు... నాస్తికుడయ్యాడు. ఆస్తికుడి వాదనలన్నీ విని నాస్తికుడు... ఆస్తికుడయ్యాడు. ఎటు తిరిగీ ఆ గ్రామంలో ఒక తీవ్ర ఆస్తికవాది, ఒక తీవ్ర నాస్తికవాది అలాగే ఉన్నారు. గ్రామస్తులందరూ యథాప్రకారం గందరగోళ పరిస్థితిలోనే మిగిలారు.


ఈ తమాషా కథను ఓషో వివరిస్తూ ‘‘సత్యం ఏమిటో ఎవరికి వారు అంతర్ముఖులై తెలుసుకోవాలి. ఎవరో చెప్పిన దాన్ని విశ్వసించి, వాదనల మీద ఆధారపడి, శాస్త్రపాండిత్యాన్ని వినియోగించి సత్యాన్ని నిగ్గు తేల్చలేం. స్వానుభవంతో మాత్రమే సత్యాన్ని గ్రహించగలం. ఆ తరువాత ఎంత గొప్ప పండితుడైనా, వక్త అయినా మనల్ని మార్చలేరు. కేవలం విశ్వాసం మీద ఆధారపడిన ఏ వ్యక్తినైనా... ఎప్పుడైనా, ఎవరైనా మార్చవచ్చు. కాబట్టి విశ్వాసం కాదు... స్వానుభవం ముఖ్యం. గ్రంథ పాండిత్యం కాదు... ఆత్మావలోకనం ముఖ్యం’’ అని వివరించారు.

రాచమడుగు శ్రీనివాసులు

ఇవీ చదవండి:

మహిళా రిజర్వేషన్ బిల్లు ముస్లిం ప్రాతినిధ్యాన్ని తుడిచివేసే చర్య: ఒవైసీ

డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిష్ఠంభన.. ఎంపీలంతా హాజరుకావాలని కాంగ్రెస్ విజ్ఞప్తి

Updated Date - Apr 17 , 2026 | 12:45 AM