శంకరాభరణం చూసి నిద్రపోలేదు...
ABN , Publish Date - Aug 02 , 2026 | 09:17 AM
నటరత్న నందమూరి తారక రామారావుపై ఉన్న అభిమానంతో చిత్ర పరిశ్రమకు వచ్చి... ఆయనతోనే ప్రయాణం మొదలుపెట్టి.. నేడు జయకృష్ణ వంటి నూతన నటులను పరిచయం చేయడం వరకు నిర్మాత అశ్వినీదత్ రూటే సపరేటు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఇండస్ట్రీ హిట్లను అందించిన ఆయన..
నటరత్న నందమూరి తారక రామారావుపై ఉన్న అభిమానంతో చిత్ర పరిశ్రమకు వచ్చి... ఆయనతోనే ప్రయాణం మొదలుపెట్టి.. నేడు జయకృష్ణ వంటి నూతన నటులను పరిచయం చేయడం వరకు నిర్మాత అశ్వినీదత్ రూటే సపరేటు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఇండస్ట్రీ హిట్లను అందించిన ఆయన ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలోని విశేషాలు, మారుతున్న చిత్రసీమ పోకడలు, తన విజయాల వెనకున్న కుమార్తెల పాత్ర గురించి ‘నవ్య’తో పంచుకున్నారు.
పరిశ్రమకు చాలామందిని పరిచయం చేశారు.ఇప్పుడు జయకృష్ణను పరిచయం చేయడం ఎలా అనిపిస్తోంది?
చాలా బాగుంది. అతడు చాలా మంచివాడు, చాలా బాగా చేశాడు. ఇదివరకు నేను పరిచయం చేసిన వాళ్లలానే ప్రత్యేకంగా ఉంటాడనిపించింది. కచ్చితంగా మంచి సక్సె్‌సఫుల్ రేంజ్‌లో ఉంటాడని నాకు అనిపిస్తోంది.
నిర్మాతగా మీరు ఒక నటుడిని ఎలా అంచనా వేస్తారు?
అలా ప్రత్యేకంగా అంచనా వేయడం ఏమీ ఉండదు. వాళ్ల కుటుంబ నేపథ్యం, నటనపై వారికి ఉండే ఆసక్తి ఏంటనేది చూస్తే తెలిసిపోతుంది. వీళ్లు బానే ఉంటారని అనిపించగానే ఓకే చేస్తాను. అంతకంటే ఏమీ ఉండదు.
మీరు ఎన్టీఆర్‌తో తొలిసారి సినిమా చేసి 50 ఏళ్లు దాటింది కదా. అసలు దేని కోసం ఇండస్ట్రీకి వచ్చారు?
అవును, 51, 52 ఏళ్లు అయింది. నిజం చెప్పాలంటే నేను ఎన్టీఆర్ అభిమానిగా చిత్రపరిశ్రమకు వచ్చాను. ఆయనతో సినిమా తీయాలనే వచ్చాను. వరుసగా రెండు సినిమాలు తీశాను. ఆ తర్వాత శోభన్‌బాబు, కృష్ణ.. ఇలా అందరితోనూ సినిమాలు చేయాలి, ఇండస్ట్రీలో ఒక పెద్దదిక్కులా ఉండాలి అనే భావన అప్పట్లో ఉండేది.
మీ ప్రయాణంలో ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు?
మారుతున్న దానిని బట్టి మనం కూడా అలా మారుతూ వచ్చాం. ఆ రోజుల్లో ఇప్పటిలా ఊహించడానికి కూడా లేదు. ఎన్నో కొత్త పద్ధతులు వచ్చాయి, వస్తున్నాయి. మనం కూడా దానికి అనుగుణంగా మారుతున్నాం. మున్ముందు మన చేతుల్లో ఏదీ ఉండదేమో. అంతా టీవీలు, డిజిటల్ పరమే అయిపోతుందేమో!
ఒకప్పుడు కథ నుంచి ట్యూన్స్ వరకు అన్నీ నిర్మాత చూసుకునేవారు. ఇప్పుడా జోక్యం తగ్గింది కదా?
అవును, మారింది. నేను కూడా పాత పద్ధతుల్లో లాగా డిస్కషన్స్ అవేమీ పట్టించుకోకపోయినా.. మ్యూజిక్ విషయంలో మాత్రం నా ఇష్టప్రకారమే నడుచుకుంటాను. కాలం మారొచ్చు, ఏమైనా జరగొచ్చు. కానీ నేను సినిమాలు తీసినంత కాలం మ్యూజిక్ నేనే చూసుకుంటాను. అది ఇష్టం లేని కొందరు సంగీత దర్శకులు నా దగ్గరకు రాకపోవచ్చేమో, కానీ నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం.
మీ టైంలో డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్షియర్లు కథల విషయంలో జోక్యం చేసుకునేవారా?
‘లక్ష్మీ ఫిలిమ్స్’ బ్యానర్‌లో ఐదారు సినిమాలు చేశాను. ఎప్పుడైనా మంచి పాటలు, సన్నివేశాలు ఉంటే లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తితో సరదాగా ‘చూడండి సార్’ అనేవాడిని. వాళ్లు మెచ్చుకుని వెళ్లేవారు తప్ప, నన్ను ఎవరూ ఎప్పుడూ ఏమీ అనలేదు. సినిమా చూడటం కానీ, కంట్రోల్ చేయడం గానీ ఎప్పుడూ జరగలేదు.
‘కాంబినేషన్’ వల్ల పరిశ్రమకు మంచి జరుగుతోందా?
నిజం చెప్పాలంటే జరగడం లేదు. దర్శకులు కథ తయారుచేసుకుని, హీరోను కలిసి కాల్షీట్లు ఉన్నాయనగానే ఓకే చెప్పడానికి ఇవాళ ఎక్కువమంది నిర్మాతలు ఉన్నారు. నేను మాత్రం ఆ కాంబినేషన్ల జోలికి వెళ్లలేదు. నాకు ఇష్టం లేదు, చేయను కూడా. రాఘవేంద్రరావుతో చేసినప్పుడు నేను కూడా కథలు వెతికేవాడిని. ఆయన ‘ఫలానా చోట కథ ఉంది, విను బావా’ అంటే వెళ్లి వినేవాడిని. అలా వచ్చినవే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘పెళ్లి సందడి’. అయితే, జూనియర్ ఎన్టీఆర్‌తో తీసిన సినిమా విషయంలోనే కొంత తప్పుటడుగు పడింది.
ఈ వయసులోనూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నది?
ఇప్పుడు నేను మా అమ్మాయిల కోసమే సినిమాలు తీస్తున్నాను. మా స్వప్న, ప్రియాంక కథలు నచ్చి సినిమాలు తీస్తే నేను అందులో భాగమవుతుంటాను. వారిద్దరూ ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. నా సుదీర్ఘ ప్రయాణంలో ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే మా ఇద్దరు అమ్మాయిలే కనపడతారు.
‘నాన్నా.. ఈ పని చేయకు’ అని మీ అమ్మాయిలు ఎప్పుడైనా అన్నారా?
ఒక సినిమా విషయంలో మాత్రం మా అమ్మాయిలు గట్టిగానే చెప్పారు. ‘ఇది మనకు పనికొచ్చే కథ కాదు డాడీ, అయినా నీ ఇష్టం’ అన్నారు. అయినా మొండితనంతో తప్పటడుగు వేశాను. ఆ సినిమా ఫ్లాప్ అయి రూ. 26 కోట్లు పోయాయి. అప్పటి నుంచి వారు చెప్పినట్టే వింటున్నాను. ఈ రోజుల్లో వారి జడ్జిమెంటే బెస్ట్.
మీ ఇద్దరు అమ్మాయిల్లో మీతో గట్టిగా మాట్లాడేది ఎవరు?
మా స్వప్నే. స్వీటీ (ప్రియాంక) మాత్రం.. ‘చూస్కోండి డాడీ’ అని చెబుతుంది తప్ప ఒత్తిడి పెట్టదు. మా ముగ్గురి మధ్య పెద్దగా డిస్కషన్స్ ఏమీ ఉండవు. స్వప్న కూడా ఒప్పుకుంటుంది. క్రియేటివిటీలోను, వర్క్‌మన్‌షి్‌పలోనూ ప్రియాంక నంబర్ వన్.
ఏదైనా మంచి సినిమా మిస్సయ్యానన్న బాధ ఉందా?
ఉంది. కె.విశ్వనాథ్ తీసిన ‘శంకరాభరణం’ చూసిన తర్వాత చాలా రోజులు నేను నిద్రపోలేదు. ‘అయ్యో! ఇది నేను తీయాల్సిన సినిమా కదా’ అని బాధపడ్డాను. ఆ ఒక్కటి తప్ప మిగతావన్నీ సంతృప్తిగానే ఉన్నాయి.
ఇండస్ట్రీకి కొత్తగా ఏదైనా పరిచయం చేయాలని అనిపించలేదా?
అలా ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే నేను గొప్ప టెక్నీషియన్లతో పనిచేశాను. రాఘవేంద్రరావుతో వరుసగా 14 సినిమాలు చేశాను. రాఘవేంద్రరావు, రాజమౌళి, నాగ్ అశ్విన్, హను రాఘవపూడి సినిమాలు చూసినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది.
నిర్మాతగా సంతృప్తిగా ఉన్నారా? నటీనటులతో సంబంధాలు ఎలా ఉన్నాయి?
నేను 75 సినిమాలు చేస్తే ఏడెనిమిది సినిమాలు మాత్రం అంచనాలు అందుకోలేకపోయాయి. మిగతావన్నీ బాగున్నాయి. నా పని పట్ల నేను పూర్తి సంతృప్తితో ఉన్నాను. పరిశ్రమ అనేది వ్యాపారమే అయినా నటీనటులు, దర్శకులతో ఉన్న అనుబంధం చాలా గొప్పది. నా సుదీర్ఘ ప్రయాణంలో ఏ హీరోతో కానీ, డైరెక్టర్లతో కానీ ఎలాంటి గొడవలు, సమస్యలు రాలేదు. నా హీరోలు, డైరెక్టర్లతో నేను హ్యాపీ. అందుకే నన్ను ‘అజాతశత్రువు’ అంటారు. ఇటీవల మాకు జాతీయ అవార్డు రావడం ఎంతో సంతోషాన్నిచ్చింది.
ఇప్పుడు నిర్మాతల జోక్యం తగ్గిందని అనిపించడం లేదా?
అవును, తగ్గింది. కాకపోతే నేను, అల్లు అరవింద్.. వంటి వాళ్లం కథని, కథా విధానాన్ని, మ్యూజిక్‌ను అనుకుని ముందుకెళ్తుంటాం. అందుకనే మాకు సినిమా ఏమవుతుందోనన్న భయం ఉండదు. నేను ఎప్పుడూ డిస్ట్రిబ్యూషన్ నుంచి బయటకు వెళ్లలేదు. అందుకనే అరవింద్, నేను, అన్నపూర్ణ స్టూడియోస్ వంటి వాళ్లం ఇంకా కొనసాగుతున్నాం.
చిన్న హీరోలతో సినిమాలు చేయాలని అనిపించలేదా?
అలా అనుకునే ‘పెళ్లిసందడి’ తీశాను. మా చిన్నపాప ప్రియాంక సింగీతం శ్రీనివాసరావుతో కలిసి ‘సింగ్ గీతం’ అనే సినిమా తీసింది. మొదట నాకు కథ అంతగా నచ్చలేదు, కానీ పూర్తయ్యాక చూస్తే అది చాలా గొప్ప సినిమా అనిపించింది. నాగ్ అశ్విన్ మంచి డైరెక్టర్. అతడి పద్ధతులు నచ్చుతాయి. అందరితో కలిసుంటాడు. అతడికేదైనా ఆలోచన వస్తే మాతోనే పంచుకుంటాడు. అతడితో సినిమా చేయడం అంటే మాకు పెద్ద పండుగ.
నేను ఇప్పుడు సొంతంగా కథలు వినడం మానేశాను. నా పిల్లలు కథలు విని నాకు చక్కగా చెబుతారు. వాళ్లు కొత్త తరహా సినిమాలు మొదలుపెట్టినప్పుడు నేను వాళ్లవైపు చేరిపోయి ‘ఇది బాగుందని, ఇది చేయాలని’ చెబుతాను అంతే.
- సీవీఎల్‌ఎన్ ప్రసాద్