Share News

అభీష్టాలు తీర్చే అష్టలక్ష్ములు

ABN , Publish Date - Aug 21 , 2026 | 05:51 AM

పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో సౌభాగ్య స్వరూపిణి అయిన మహాలక్ష్మి ఆరాధన, ధ్యానం, ఉపాసన సత్పలితాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. విశిష్టమైన ఎనిమిది లక్ష్మీ రూపాలను...

అభీష్టాలు తీర్చే అష్టలక్ష్ములు

తెలుసుకుందాం

పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో సౌభాగ్య స్వరూపిణి అయిన మహాలక్ష్మి ఆరాధన, ధ్యానం, ఉపాసన సత్పలితాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. విశిష్టమైన ఎనిమిది లక్ష్మీ రూపాలను అష్టలక్ష్ములుగా... ఆగమ, శిల్స శాస్త్రాలు వర్ణించాయి. ఆ రూపాలను దర్శించినా, ధ్యానించినా, స్మరించినా ఫలితం అపారమనీ, అసంఖ్యాకమైన శుభాలు కలుగుతాయనే విశ్వాసం ఉంది. ఆ లక్ష్మీ రూపాల గురించి, వాటిని పూజించడం వల్ల కలిగే ఫలితాలుగా పూర్వులు పేర్కొన్న అంశాలను తెలుసుకుందాం.

నాలుగు చేతులలో... రెండు చేతులతో అభయ ముద్రలను రెండు చేతులతో పద్మాలను ధరించిన తిరుచానూరు పద్మావతీ అమ్మవారిని ‘స్వతంత్ర వీరలక్ష్మి’గా అభివర్ణిస్తారు. మిగిలిన లక్ష్మీ స్వరూపాలన్నీ సాధారణంగా కరండ మకుటమనే కిరీటాన్ని ధరిస్తాయి. కానీ శ్రీవేంకటేశుని పట్టపురాణి అయిన పద్మావతీదేవి... శ్రీ వేంకటేశ్వరునిలాగానే కిరీట మకుటం ధరించి ఉంటుంది. ఆమెకు బ్రహ్మోత్సవాలు కూడా ప్రత్యేకంగా జరుగుతాయి.

శ్రీధాన్యలక్ష్మి

అష్టలక్ష్ములలో రెండో రూపం. ప్రతి ప్రాణి ఆకలినీ తీర్చడం కోసం ఆహారాన్ని అందించే అమ్మ. ఆమె ఆరు చేతులతో గజ వాహనంపై, సర్వాలంకారాలతో దర్శనం ఇస్తుంది. తెల్లని శరీర ఛాయతో, ప్రకాశిస్తున్న కిరీటంతో, కృపతో నిండిన రూపంతో, చేతులకు దండ కడియాలతో ఉంటుంది. కుడివైపు చేతులలో అభయముద్ర, పాత్ర, వరికంకి, ఎడమవైపు చేతులలో వరద ముద్ర, చెరుకుగడ, పద్మం ధరిస్తుంది. ధాన్యలక్ష్మిని ధ్యానిస్తే ఇంట్లో అన్నపానాలకు, ధాన్యానికి ఎన్నటికి కొరత ఉండదు. ఆకలి బాధ ఎప్పటికీ ఎదురుకాదు. నిత్య ధాన్య సమృద్ధి, సకల భోగ భాగ్యాలు సిద్ధిస్తాయి.


శ్రీసంతానలక్ష్మి

అష్టలక్ష్ములలో మూడో రూపం. సత్సంతానాన్ని ప్రసాదించి, వంశవృద్ధిని కలుగజేసేది సంతానలక్ష్మి. ఆమె నాలుగు చేతులతో, జటామకుటంతో, ముత్యాలహారాలను ధరించి ఉంటుంది. చేతుల్లో దీపాలు, చామరాలతో, కవచాలు ధరించిన వీరులు ఇరువైపులా ప్రకాశిస్తూ ఉండగా... ఆమె స్థిరాసనంపై ఆశీనురాలై దర్శనం ఇస్తుంది. కుడివైపు ఒక చేత అభయముద్ర, మరో చేతిలో ఖఢ్గం, ఎడమవైపు ఒక చేత వరద ముద్ర, మరో చేతిలో ఖేటం (డాలు) ధరిస్తుంది. సంతానలక్ష్మిని ధ్యానం చేస్తే... సంతానలేమికి కారణమయ్యే దోషాలు తొలగిపోతాయి. దీర్ఘాయువు, తేజస్సు లాంటి శుభయోగాలు కలిగిన, యోగ్యులైన సంతానం కలుగుతారు.

శ్రీగజలక్ష్మి

అష్టలక్ష్ములలో నాలుగో రూపం. ఆమె ఎర్రని శరీరచ్ఛాయతో, ప్రకాశించే కిరీటంతో, వ్యాపించిన కుంతలాలతో (కేశాలతో), నాలుగు చేతులతో పద్మాసనం మీద ఆసీనురాలై ఉంటుంది. కుడివైపు ఒక చేత అభయముద్ర, మరో చేత పద్మం, ఎడమవైపు ఒక చేత వరదముద్ర, మరో చేత ఇంకో పద్మాన్ని ధరించి ఉంటుంది. ఇరువైపులా రెండు ఏనుగులు నిత్యం తమ తొండాలతో నీరు పోస్తూ ఆమెను అభిషేకిస్తూ ఉంటాయి. గజలక్ష్మిని ధ్యానించడం వల్ల ఇంట్లో అకారణ ద్వేషాలు, వ్యాపారంలో నష్టాలు, అపకీర్తి లాంటివి తొలగిపోతాయి. సమాజంలో అఖండమైన గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలతో పాటు విశేషమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.

శ్రీ ధనలక్ష్మి

అష్టలక్ష్ములలో అయిదో రూపం. ఆమె పచ్చని శరీర కాంతితో, చక్కటి కిరీటంతో, అన్ని అవయవాలకూ ఆభరణాలను ధరించి ఉంటుంది. ఆమెకు ఆరు చేతులు. కుడివైపున చక్రం, బాణం, తాంబూలం, ఎడమవైపున శంఖం, విల్లు, కమండలం ధరిస్తుంది. తనను పూజించినవారికి ధనాన్ని, సంపదను ఆమె అనుగ్రహిస్తుంది. ధనలక్ష్మీ దేవిని ధ్యానిస్తే... గృహాన్ని పట్టి పీడిస్తున్న అనవసరమైన ఇబ్బందులు, రుణబాధలు, ఆకస్మికమైన ధన నష్టాలు, వ్యాపారాలలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. లాభాలు చేకూరుతాయి. ఎంతోకాలంగా ఇతరుల దగ్గర నిలిచిపోయిన ధనం తిరిగి వస్తుంది.

శ్రీ విజయలక్ష్మి

అష్టలక్ష్ములలో ఆరో రూపమైన విజయలక్ష్మీ దేవి తలచిన పనుల్లో విజయాన్ని కలుగజేసే అనుగ్రహ రూపిణి. ఆమె బంగారం లాంటి పచ్చని శరీర కాంతితో, ఎనిమిది చేతులతో, పూలదండలు ధరించి, సింహ వాహనంపై కూర్చొని ఉంటుంది. కుడివైపు ఒక చేత అభయముద్రను, మిగిలిన చేతుల్లో ఖడ్గం, పాశం, చక్రాలను, ఎడమవైపు ఒక చేత వరద ముద్రను, మిగిలిన చేతుల్లో డాలు, అంకుశం, శంఖాలను ధరించి దర్శనమిస్తుంది. ఈ దేవిని అర్చిస్తే అంతర్గత శత్రువులైన కామద్రోధాదులు, మనస్సులోని భయం, బద్ధకం లాంటివి నశిస్తాయి. ఆత్మవిశ్వాసం, అచంచలమైన ధైర్యం, కార్యదక్షత కలుగుతాయి. సర్వత్రా విజయం లభిస్తుంది.


శ్రీ ఐశ్వర్యలక్ష్మి

అష్టలక్ష్ములలో ఏడో రూపమైన ఈ దేవి ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది. ఐశ్వర్య లక్ష్మీ దేవి నాలుగు చేతులతో, అశ్వవాహనం మీద ఆసీనురాలై ఉంటుంది. ఇరు చేతులతో అభయ, వరద ముద్రలను, మరో రెండు చేతుల్లో పద్మాలను ధరించి ఉంటుంది. ఐశ్వర్యలక్ష్మీదేవిని ధ్యానం చేయడం వల్ల ధనలాభం, స్థిరమైన ఆస్తులు, భూయోగం, భవన యోగం లాంటివి కలుగుతాయి. వాటిని అనుభవించగలిగే ఆరోగ్యం, బంధువులు, మిత్రుల సాన్నిహిత్యం, సమాజంలో గౌరవ మర్యాదలతో కూడిన అఖండ ఐశ్వర్యం లభిస్తాయి.

శ్రీ వీరలక్ష్మి

అష్టలక్ష్ములలో ఎనిమిదో రూపం. ఆమెనే ఽ‘దైర్యలక్ష్మి’ అని కూడా అంటారు. ఆమె బంగారం లాంటి పచ్చని శరీర కాంతితో, సర్వ శుభ లక్షణాలతో, ఎనిమిది చేతులతో, సింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది. కుడి వైపు ఒక చేత అభయముద్ర, మిగిలిన చేతుల్లో శూలం, బాణం, చక్రం, ఎడమవైపున ఒక చేత వరద ముద్ర, మిగిలిన చేతుల్లో కపాలం, విల్లు, శంఖాలను ధరించి ఉంటుంది. వీరలక్ష్మీదేవి ధ్యానం వల్ల మనస్సులో చంచలత్వం, పిరికితనం, ఆత్మన్యూనతా భావం, జాతకరీత్యా కలిగే మానసిక బలహీనతలు తక్షణమే సమసిపోతాయి. సాధకుడికి వజ్ర సమానమైన మనోబలం, కార్యదక్షత, సమస్త కార్యాల్లో విజయం చేకూరుతాయి.

శ్రీఆదిలక్ష్మి

అష్టలక్ష్ములలో మొదటిదైన ఆదిలక్ష్మి... సర్వాభరణ భూషితగా, సర్వ లక్షణ శోభితగా, మెడలో హారాలను... కుడి చేత పద్మంతో కూడిన అభయ ముద్రను, ఎడమ చేత వరద ముద్రను ధరించి ఉంటుంది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వక్షస్థలంలో కొలువై, నిత్యం పూజలను అందుకొనేది... ఆది లక్ష్మే. అయితే అక్కడ అమ్మవారు వరద, అభయ హస్తాలతో పద్మంపై పద్మాసనంలో కూర్చొని ఉంటారు. ఆదిలక్ష్మీదేవిని ధ్యానిస్తే మనసులోని అశాంతి, అనవసరమైన భయాలు, అసూయా భావాలు తొలగిపోతాయి. హృదయం సాత్విక గుణాలతో కూడిన దైవికమైన శాంతితో, ప్రసన్నతతో నిండిపోతుంది. అఖండ సంపదలు కలుగుతాయి.

డి.యన్‌.వి. ప్రసాద్‌ స్థపతి

9440525788

ఇవి కూడా చదవండి:

పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Aug 21 , 2026 | 05:51 AM