Share News

అద్వైతమూర్తి

ABN , Publish Date - Apr 17 , 2026 | 01:07 AM

సంభవామి యుగే యుగే... అన్నట్టు మానవజాతికి జ్ఞాన భిక్ష పెట్టడం కోసం కృతయుగంలో దక్షిణామూర్తిగా, ద్వాపరయుగంలో వేదవ్యాసుడి రూపంలో, కలియుగంలో...

అద్వైతమూర్తి

శ్రీశంకర జయంతి, శ్రీరామానుజ జయంతి సందర్భంగా..

సంభవామి యుగే యుగే... అన్నట్టు మానవజాతికి జ్ఞాన భిక్ష పెట్టడం కోసం కృతయుగంలో దక్షిణామూర్తిగా, ద్వాపరయుగంలో వేదవ్యాసుడి రూపంలో, కలియుగంలో ఆదిశంకరుల రూపంలో పరమేశ్వరుడు అవతరించాడు. భారతీయుల ఆధ్యాత్మిక జీవితాన్ని, సాంస్కృతిక సరళిని ఆదిశంకరుల్లా ప్రభావితం చేసినవారు మరొకరు లేరు. శంకరుల అవతార వైభవంలో... ఆయన గాథ, ఆయన బోధ రెండూ అద్భుతమైనవే.

నాస్తిక ధోరణులు ప్రబలి, అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న భారతావనిలో జ్ఞాన దీపం వెలిగించిన భాస్కరుడు శ్రీశంకరులు. అసాధారణ ఆధ్యాత్మిక శక్తితో, అకుంఠిత వాదనా పటిమతో దుర్మత నిర్మూలన చేసి... ఆర్ష సంప్రదాయాలను, ఆరాధనా విధానాలను సమన్వయపరచిన ధీశాలి. రూపాలు వేరైనా భగవంతుడు ఒక్కడే అని, ఆరాధనలు వేరైనా అవన్నీ భగవంతుడికే చేరుతాయని ఆయన ఉద్ఘాటించారు. గాణపత్యం, శైవం, శాక్తం, సౌరం, వైష్ణవం, స్కాందం (కుమారోపాసన) అనే ఆరు ఆరాధనా పద్థతులను సమన్వయపరచి... ‘షణ్ముఖ స్థాపనాచార్యుడు’ అయ్యారు. ‘‘పూజకు ముందుగా ‘పరమేశ్వర ప్రీత్యర్థం...’ అని సంకల్పం చేసే సంప్రదాయాన్ని ప్రారంభించినది ఆదిశంకరులే’’ అని కంచి పరమాచార్య చెప్పారు. శ్రీ శంకరులు బ్రహ్మ సూత్రాలకు, ఉపనిషత్తులకు, భగవద్గీతకు భాష్యాలు రాశారు. అవి ‘ప్రస్థానత్రయం’గా ప్రసిద్ధి చెందాయి. తర్క, మీమాంసాది శాస్త్రాలను అధ్యయనం చేయడానికి శంకర భాష్యాలు మార్గదర్శనం చేస్తాయి. భక్తి ప్రపత్తులు బలపడాలంటే వివేక చూడామణి, ఆత్మబోధ, అపరోక్షానుభూతి, ఉపదేశ సాహస్రి లాంటి గ్రంథాలు దోహదపడతాయి. అనాది కాలం నుంచి వేదాలు, ఉపనిషత్తులలో నిబిడీకృతమైన అద్వైత సిద్ధాంతాన్ని వెలికి తీసి... సమాజానికి అనువైన పద్ధతిలో అన్వయించి చెప్పి, తిరుగులేని తాత్త్విక సిద్ధాంతంగా స్థిరపరచి... ప్రజాబాహుళ్యానికి అందించారు. ప్రస్థానత్రయాన్ని అసమాన రీతిలో సమన్వయం చేసి, సాధారణంగా అవన్నీ అద్వైతాన్నే చెబుతున్నాయని వివరించారు. అప్పటి నుంచి అద్వైతం విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.

అనితర సాధ్యం ఆ మార్గం

ధర్మప్రచారం భావితరాల కోసం నిరంతరంగా కొనసాగడానికి, అద్వైత సిద్ధాంతాన్ని సుస్థిరంగా నిలబెట్టడానికి శంకరులు ఎంచుకున్న మార్గం అతి సాధారణంగా కనిపిస్తుంది కానీ... అది అనితరసాధ్యం, లోకోత్తరం. పాదచారిగా నిత్య సంచారం చేయడంతో ప్రజలతో ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది. సనాతన ధర్మ ప్రచారం లక్ష్యంగా... కంచిలో పీఠ స్థాపన చేసి అక్కడ కొంతకాలం ఉన్నారు. దక్షిణాదిన శృంగేరి శారదా పీఠం, ఉత్తరాదిన బదరిలో జ్యోతిర్పీఠం, తూర్పున పూరిలో గోవర్థనపీఠం, పశ్చిమాన ద్వారకలో శారదా (కాళికా) పీఠాలను స్థాపించారు. ఋగ్వేదం నుంచి ‘ప్రజ్ఞానం బ్రహ్మ’, యజుర్వేదం నుంచి ‘అహం బ్రహ్మస్మి’, సామవేదం నుంచి ‘తత్త్వమసి’, అధర్వణ వేదం నుంచి ‘అయమాత్మా బ్రహ్మ’ అనే నాలుగు మహా వాక్యాలను తీసుకొని... నాలుగు మఠాలకు అనుసంధానించారు. ఆ వ్యవస్థలు నిరంతరాయంగా కొనసాగడం కోసం మఠామ్నాయ శాసనాలు ఏర్పరిచారు. అవన్నీ కాలపరీక్షకు నిలిచి, నేటికీ అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నాయి. ఇది శంకరుల వ్యవస్థా నైపుణ్యానికి, దార్శనికతకు తిరుగులేని నిదర్శనం.


ఆది గురువు, దార్శనికుడు

ఉత్తర భారతీయుడైన సురేశ్వరులను దక్షిణాన శృంగేరి పీఠాధిపతిగా, దక్షిణాత్యుడైన తోటకాచార్యుణ్ణి బదరి వద్ద జ్యోతిర్మఠ నిర్వహణకు నియమించారు. కర్ణాటక బ్రాహ్మణులు నేపాల్‌లో, మహారాష్ట్ర బ్రాహ్మణులు రామేశ్వరంలో, కేరళ నంబూద్రి బ్రాహ్మణులు బదరిలో అర్చకులుగా ఉండేలా ఆదేశించారు. అన్నిటికన్నా ప్రధానంగా చెప్పుకోవాల్సిందేమిటంటే... కేరళకు చెందిన శంకరులు... నర్మదాతీర వాసి అయిన గోవింద భగవత్పాదులను గురువుగా స్వీకరించారు. ఆంగ్లేయుల పాలన అనంతరమే జాతీయ సమైక్యతా భావన నెలకొన్నదనే వాదన అసంగతమనేది దీనివల్ల స్పష్టమవుతుంది. ఎన్ని తరాలు మారినా, సిద్ధాంతాలు మారినా అద్వైత సిద్ధాంతం నిత్య నూతన తేజస్సుతో ప్రకాశిస్తూనే ఉంటుంది. అనేక ఆరాధనా విధానాలను సామాన్యుల చెంతకు చేర్చిన ఆది గురువు, దార్శనికుడు, ఆచరణాత్మక వేదాంతి, అద్భుత తార్కికుడు, జ్ఞాని... శ్రీ ఆదిశంకరులు.

ప్రసాదవర్మ కామఋషి

9441274034

భగవదార్చనలో అవైదిక ఆచారాలను, అంధానుకరణలను శ్రీ శంకరులు నిర్మూలించి, కులమతాలకు అతీతంగా... ఆర్షధర్మాన్ని అందరికీ అనుసరణీయం చేశారు. 72 వికృత ఉపాసనా విధానాలు హిందూ మతం పేరు చెప్పుకొంటూ చెలరేగిన రోజులవి. ఆ మతాలలోని హింసాయుత, అవైదిక, తాంత్రిక పద్ధతులకు శాస్త్రీయంగా సమాధానం చెప్పి, ఒప్పించి... వాటన్నిటినీ వైదిక విధానం వైపు మార్చిన ప్రజ్ఞాధురీణుడు శంకరాచార్యులు. ఛండాలునిలో కూడా శివుణ్ణి దర్శించి, పాదాభివందనం చేసిన సంస్కారం ఆయనది. శంకరులు ఎంత ఆధ్యాత్మికవేత్తో అంతటి లౌకిక వాది, వ్యవహారవేత్త. సనాతన ధర్మాన్ని ఆధారం చేసుకొని సమాజసేవకు పూనుకున్న తత్త్వవేత్త. సన్యసించడం అంటే సమాజాన్ని దూరం పెట్టడం కాదనీ, సమాజంలో ఉంటూనే దాన్ని సంస్కరించడానికి పాటుపడాలని నమ్మిన ఆచార్యులు. తన ఎనిమిదోయేట మొదలుపెట్టి దాదాపు 24 ఏళ్ళపాటు మానవాళి అభ్యుదయం కోసం, సమాజంలో సుఖశాంతుల కోసం శ్రమించిన ధన్యజీవి. వైసుధైక కుటుంబమే ఆయన ఆశయం.

ఇవీ చదవండి:

మహిళా రిజర్వేషన్ బిల్లు ముస్లిం ప్రాతినిధ్యాన్ని తుడిచివేసే చర్య: ఒవైసీ

డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిష్ఠంభన.. ఎంపీలంతా హాజరుకావాలని కాంగ్రెస్ విజ్ఞప్తి

Updated Date - Apr 17 , 2026 | 01:07 AM