కోడర్లూ.. వేరే దారి చూసుకోండి!
ABN , Publish Date - Feb 07 , 2026 | 03:42 AM
నానాటికీ వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ కోడింగ్ సామర్థ్యం నేపథ్యంలో.. కోడింగ్ చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులంతా వేరే బతుకుతెరువు చూసుకోవాల్సిందేనని ‘జోహో’ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఐటీ నిపుణుడు శ్రీధర్ వెంబు సూచించారు.
కోడింగ్ చేసే టెకీలకు జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ సూచన
ఏఐతో ఒక వ్యక్తి భగవద్గీత యాప్‌ను అభివృద్ధి చేయడంపై పోస్ట్
చెన్నై, ఫిబ్రవరి 6: నానాటికీ వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ కోడింగ్ సామర్థ్యం నేపథ్యంలో.. కోడింగ్ చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులంతా వేరే బతుకుతెరువు చూసుకోవాల్సిందేనని ‘జోహో’ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఐటీ నిపుణుడు శ్రీధర్ వెంబు సూచించారు. ఎలాంటి ఒకోడింగ్ సామర్థ్యమూ లేకుండా క్లాడ్ ఏఐ సాయంతో భగవద్గీత యాప్‌ను రూపొందించిన ఒక యూజర్ పోస్టును శ్రీధర్.. తన ‘ఎక్స్’ ఖాతాలో రీపోస్ట్ చేశారు. ‘‘ఈ పోస్ట్ భగవద్గీత యాప్ గురించి. ఆంత్రోపిక్ సంస్థ తన క్లాడ్ ఏఐ సహాయంతో పూర్తి ‘సి’ కంపైలర్‌ను అభివృద్ధి చేసింది. సామాన్యమైన ఇంజినీరింగ్ విజయం కాదిది. ఈ తరుణంలో.. జీవనోపాధి కోసం కోడింగ్‌పై ఆధారపడుతున్నవారంతా ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలు వెతుక్కోవడం మంచిది... నాతో సహా. ఈ మాట నేను భయాందోళనలతో చెబుతున్నది కాదు. ప్రశాంతమైన అంగీకారంతో, మార్పును స్వీకరించాలనే ఉద్దేశంతో చెబుతున్న మాట ఇది’’ అని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. ఏఐ విప్లవం నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏవిధంగా రూపాంతరం చెందుతోందనే అంశంపై తాను గూగుల్ జెమినై చాట్‌బాట్‌తో సవివర చర్చ జరిపానని తెలుపుతూ.. ఆ వివరాలను తన పోస్ట్‌లో షేర్ చేశారు. అందులో ఆయన జెమినై చాట్‌బాట్‌తో.. ‘పోస్ట్ లేబర్ ఎకానమీ (శ్రమ లేని ఆర్థిక వ్యవస్థ)’లో సమాజం ఎలా అభివృద్ధి చెందుతుందనే అంశంపై చర్చించడం గమనార్హం. దాంతో తాను చర్చిస్తుంటే.. అత్యంత తెలివైన ఆర్థిక తత్వవేత్తతో చర్చిస్తున్నట్టు అనిపించిందని.. తన పని గురించి తననే విమర్శించుకోవాల్సిందిగా తాను సూచిస్తే, ఏఐ ఆ పనిని అద్భుతంగా చేసిందని వెంబు వివరించారు. దాంతో జరిపిన సంభాషణ ఆధారంగా.. ఈ సాంకేతికత ఎవరి అధీనంలో ఉంటుంది? దీని ద్వారా వచ్చే ఆదాయం ఎవరికి చెందుతుందనే అంశాలను బట్టి భవిష్యత్తును రెండు రకాలుగా ఊహించారాయన. అందులో ఒకటి ఆశావహ దృక్పథం కాగా.. మరొకటి నిరాశావాదంతో కూడినది. మొదటి తరహా భవిష్యత్తులో అయితే.. ఈ టెక్నాలజీ మనందరి జీవితాల్లో భాగమైపోయి, మనం పని గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా జీవితంపైన, కుటుంబం, ప్రకృతి, కళలు, సంగీతం, సంప్రదాయాలు, క్రీడలు, పండుగలు, విశ్వాసాల వంటివాటిపై హాయిగా దృష్టి కేంద్రీకరించవచ్చని పేర్కొన్నారు. నిరాశావాద దృక్పథంతో ఆలోచిస్తే.. టెక్నాలజీ కొందరి చేతుల్లోకి వెళ్లి కేంద్రీకృత నియంత్రణకు దారితీస్తుందని ఆందోళన వెలిబుచ్చారు. అయితే.. ఆయన అభిప్రాయాలతో పలువురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు విభేదించారు. ఏఐ ఎంత వేగంగా కోడింగ్ చేసినా అందులో ఏవైనా తప్పులు వస్తే అది బాధ్యత వహించదని, ఆ కోడ్ సరిగా ఉందీ లేనిదీ చూడాల్సింది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లేనని అభిప్రాయపడ్డారు.