మణిపూర్ నూతన ముఖ్యమంత్రిగా యుమ్నాం ఖేమ్‌చంద్ సింగ్
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:16 AM
జాతి విద్వేషాలతో అతలాకుతలమైన మణిపూర్ రాష్ట్రంలో రాజకీయ మార్పునకు రంగం సిద్ధమయింది. నూతన ముఖ్యమంత్రిగా సీనియర్ నేత యుమ్నాం ఖేమ్‌చంద్ సింగ్..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: జాతి విద్వేషాలతో అతలాకుతలమైన మణిపూర్ రాష్ట్రంలో రాజకీయ మార్పునకు రంగం సిద్ధమయింది. నూతన ముఖ్యమంత్రిగా సీనియర్ నేత యుమ్నాం ఖేమ్‌చంద్ సింగ్ (62)ను నియమిస్తున్నట్టు మంగళవారం బీజేపీ ప్రకటించింది. అంతకుముందు ఇక్కడ జరిగిన ఆ రాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఆయనను నాయకునిగా ఎన్నుకున్నారు. కుకీ జాతి నాయకురాలు నెమ్చా కిప్‌గెన్‌ను ఉపముఖ్యమంత్రిగా నియమించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో మెయిటీ-కుకీ జాతుల మధ్య విద్వేషాల కారణంగా హింస నెలకొనడంతో బిరేన్ సింగ్ 2025 ఫిబ్రవరి 9న సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం విధించిన రాష్ట్రపతి పాలన దాదాపు ఏడాదిగా కొనసాగుతోంది. ఖేమ్‌చంద్ 2017, 2022ల్లో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2017లో స్పీకర్‌గా నియమితులయి అయిదేళ్లపాటు పనిచేశారు. తైక్వాండోలో ఫిఫ్త్ డాన్ బ్లాక్ బెల్ట్ పొందిన ఆయన రాష్ట్రంలో ఆ క్రీడ వ్యాప్తికి కృషి చేశారు.