Share News

యువత నిస్తేజం

ABN , Publish Date - Sep 20 , 2026 | 06:02 AM

ఉన్నత చదువులు, జీవితంలో స్థిరపడేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాల్ని అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్న యువత. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే.

యువత నిస్తేజం

  • చదువు, ఉద్యోగం, నైపుణ్యాలకు దూరం

  • ఏపీ, తెలంగాణల్లో దాదాపు సగం జిల్లాల్లో

  • 25 శాతానికిపైగా యూత్‌ పరిస్థితి ఇంతే

  • దేశంలోని 250 జిల్లాలో 25శాతం మంది

  • యువతకు పనీ లేదు.. చదువూ లేదు

  • పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే నివేదిక

హైదరాబాద్‌, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఉన్నత చదువులు, జీవితంలో స్థిరపడేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాల్ని అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్న యువత. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. కానీ, అదే యువతలో 25 శాతం మంది దీనికి భిన్నంగా విద్య, ఉపాధి రంగాల్లో వెనుకబడి ఉన్నారు. ఉద్యోగం, ఉపాధి, నైపుణ్య రంగాల్లో సత్తా చాటాల్సిన యువత ఆ దిశగా ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లడం లేదు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని సగం జిల్లాల్లో 25 శాతం మంది యువత నిస్తేజంగా మారారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో 15-29 ఏళ్ల మధ్య వయసు వారిలో చాలా మంది చదువకు దూరంగా ఉంటున్నారు. పోనీ పనేమైనా చేస్తున్నారా? అంటే అది కూడా లేదు. ఇక, నైపుణ్యాలను కూడా అందిపుచ్చుకోలేకపోవడం ఆందోళనకరంగా మారింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో ఆందోళన కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లో 15-29 ఏళ్ల మధ్య ఉన్న యువతలో 25 శాతానికిపైగా నీట్‌(ఎన్‌ఈఈటీ-నాట్‌ ఇన్‌ ఎంప్లాయిమెంట్‌, ఎడ్యుకేషన్‌, ట్రైనింగ్‌) కేటగిరీలో ఉన్నట్లు పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే-20259(పీఎల్‌ఎఫ్ఎస్‌) వెల్లడించింది. వీటిలో ఏపీ, తెలంగాణలోనూ దాదాపు సగం జిల్లాల్లో 25 శాతం మందికిపైగా యువత ఇదే కేటగిరీలో ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2025 పీఎల్‌ఎఫ్ఎస్‌ నివేదికలో విద్యావంతులైన(సెకండరీ, అంతకంటే పైస్థాయి విద్య) 15 ఏళ్లు పైబడ్డవారిలో నిరుద్యోగ రేటు 2024లో 7శాతం ఉండగా, 2025లో 6.5 శాతానికి తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే.. ఒడిశా, అసోంలలోని సగం జిల్లాల్లో 25 శాతం మంది యువత ఖాళీగా ఉంటున్నట్టు వివరించింది.


దేశవ్యాప్తంగా..

దేశంలోని 250 జిల్లాల్లో 25 శాతం మంది యువత పనీపాటా లేకుండా ఉన్నారని కేంద్ర గణాంక శాఖ తాజాగా విడుదల చేసిన మొట్టమొదటి జిల్లా స్థాయి లేబర్‌ ఫోర్స్‌ సర్వే-2025 స్పష్టం చేస్తోంది. వీరికి చదువుకుందామన్న ధ్యాస కానీ.. పనిచేయాలన్న ఆలోచన కానీ.. పోనీ ఏదైనా శిక్షణ తీసుకుందామన్న ఉద్దేశం కానీ.. బొత్తిగా లేకుండా పోయిందని సర్వే వెల్లడించింది. ఈ తరహా పరిస్థితి మానవ వనరుల వినియోగంలో భారీ అంతరాన్ని పెంచుతోందన్నది కేంద్రం చెబుతున్న మాట. ఇదే విషయాన్ని ఇటీవల నీతి ఆయోగ్‌ కూడా వెల్లడించింది. దాదాపు 9 కోట్ల మంది యువత ఖాళీగా ఉన్నారని తెలిపింది. అయితే.. వీరంతా నిరుద్యోగులు కారని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కానీ, తాజా సర్వేలో మాత్రం పనీపాటా లేకుండా గడుపుతున్నారని వెల్లడించింది. యువత నిస్తేజంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఈశాన్య రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. అలానే.. బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, హరియాణ, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో మూడింట రెండు వంతుల జిల్లాల్లో యువత ఖాళీగా ఉన్నట్టు పేర్కొంది. నీట్‌(నాట్‌ ఇన్‌ ఎంపాయిమెంట్‌, ఎడ్యుకేషన్‌, ట్రైనింగ్‌)లో ఆయా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయట!. కాగా, పలు రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో ‘నీట్‌’ పరిస్థితి 10 శాతం కంటే కూడా తక్కువగానే ఉందని సర్వే నివేదిక వెల్లడించింది. వీటిలో ఛత్తీస్‌గఢ్ లోని కబీర్‌ధామ్‌, రాజ్‌నందన్‌గావ్‌, ఉత్తర బస్తర్‌ కాంకేర్‌, హిమాచల్‌లోని చాంబా, కేరళంలోని ఎర్నాకులం, మధ్యప్రదేశ్‌లోని మండ్లా జిల్లాలు ఉన్నాయి.

Updated Date - Sep 20 , 2026 | 06:06 AM