అనారోగ్యం బారిన యువ శ్రామిక శక్తి
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:31 AM
స్ర్కీన్ మసకగా కనిపిస్తోంది. తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తోంది. ఏమై ఉంటుంది.. అని ఆఫీసులో కొలీగ్‌ను 30 ఏళ్ల శరత్ అడిగితే..
చిన్న వయసులోనే ఉద్యోగులకు జీవనశైలి వ్యాధులు
31-35 ఏళ్ల మధ్య నలుగురిలో ఒకరు ప్రీడయాబెటిక్
63 శాతం మందికి అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయులు
50 శాతం మందికి అధిక రక్తపోటు ఉన్నట్లు వెల్లడి
62 శాతం కాన్పులు శస్త్రచికిత్సల ద్వారానే..
నగరాల్లో భారీగా ప్రసూతి ఖర్చులు.. పజ్‌కేర్ అధ్యయనం
న్యూఢిల్లీ, మార్చి 17: స్ర్కీన్ మసకగా కనిపిస్తోంది. తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తోంది. ఏమై ఉంటుంది.. అని ఆఫీసులో కొలీగ్‌ను 30 ఏళ్ల శరత్ అడిగితే.. ఓసారి బ్లడ్ టెస్ట్ చేయించుకో.. అని ఆ కొలీగ్ రవి సలహా ఇచ్చాడు. శరత్ బ్లడ్ టెస్ట్ చేయిస్తే షుగర్ ఉందని తేలింది. ఇంత చిన్న వయసులో నాకు షుగర్ ఏంటి అంటూ శరత్ తల పట్టుకున్నాడు. శరత్ ఒక్కడే కాదు ఉద్యోగాలు చేసే చిన్న వయసు వారు చాలా మంది ఇలాంటి జీవనశైలి జబ్బుల బారిన పడుతున్నారు. ఈ జబ్బులు మనదేశ శ్రామికశక్తిలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. భారత్‌లో యువ శ్రామికశక్తి 40 ఏళ్ల లోపే ప్రీ-డయాబెటిస్, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతోందని పజ్‌కేర్ అనే సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 4 లక్షల మంది కవరయ్యే బీమాకు సంబంధించి 77 వేల క్లెయిములు, 12 వేల ఆరోగ్య పరీక్షలను అధ్యయనం చేసి ‘ది ఎంప్లాయి హెల్త్ మ్యాటర్-2026’ పేరుతో ఆ నివేదికను విడుదల చేసింది. కార్యాలయాల్లోని ఉద్యోగుల ఆరోగ్య విషయంలో వచ్చిన మార్పులను ఈ నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే ఈ వ్యాధులు చిన్న వయసు వారిని చుట్టుముట్టడానికి ముఖ్యంగా జీవనశైలి, అధిక ఒత్తిడి, మార్పులకు గురయ్యే పనివిధానాలు కారణమని తెలిపింది. ఇక కంపెనీ ప్రాయోజిత ఆరోగ్య బీమాల్లోని అన్ని క్లెయిముల కన్నా ప్రసూతి క్లెయిములే ఎక్కువ. ఆస్పత్రుల చేరికల్లో 20 శాతం అవే. డెలివరీ విధానాల కారణంగా ఖర్చు కూడా పెరుగుతోంది. ఆపరేషన్ల ద్వారానే సుమారు 62 శాతం కాన్పులు జరుగుతున్నాయి. నాన్ మెట్రో నగరాలకన్నా మెట్రో నగరాల్లో 42 శాతం-48 శాతం అధికంగా ప్రసూతి ఖర్చులు అవుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల వంటి డిపెండెట్ల విషయంలో అత్యధిక విలువతో కూడిన క్లెయిములు ఉంటున్నాయి. వీటిలో ముఖ్యంగా హృద్రోగ సంబంధిత వైద్యం, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి.
అధ్యయనంలో ముఖ్యాంశాలు
77 వేల బీమా క్లెయిములు, 12 వేల హెల్త్ చెక్‌పలు పరీక్షించిన మీదట దేశంలోని యువ శ్రామికశక్తిలో జీవనశైలి వ్యాధులు భారీగా పెరుగుతున్నాయి.
31 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి నలుగురు పురుషుల్లో ఒకరిలో హెచ్‌బీఏ1సీ స్థాయిలు అసాధారణంగా ఉన్నాయి. ఇది ప్రీడయాబెటిక్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న ఉద్యోగుల్లో 63 శాతం మందిలో కొలెస్ట్రాల్ స్థాయిల్లో మార్పులు కనిపిస్తున్నాయి.
35 ఏళ్ల లోపు ఉద్యోగుల్లో సమారు 50 శాతం మందిలో అధిక రక్తపోటు ఉంటోంది.
ఆపరేషన్ ద్వారానే 62 శాతం కాన్పులు జరుగుతున్నాయి. దీని వల్ల హెల్త్‌కేర్ ఖర్చులు పెరుగుతున్నాయి. మెట్రో సిటీల్లో 42 నుంచి 48 శాతం వరకూ ఎక్కువగా ఆ ఖర్చు ఉంటోంది.