Share News

500 ఏళ్లు వేచిచూశాం.. ఒక్క 15 రోజులు ఆగలేరా..

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:03 AM

అయోధ్యలో రామాలయ నిర్మాణం కలను నెరవేర్చుకోవడానికి 500 ఏళ్లు ఎదురుచూశామని.. ఇప్పుడు ఆలయ నిర్మాణానికి వచ్చిన విరాళాలు మాయమయ్యాయన్న...

500 ఏళ్లు వేచిచూశాం.. ఒక్క 15 రోజులు ఆగలేరా..

  • అయోధ్యలో విరాళాలు మాయమంటూ నిందలేయొద్దు

  • యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌

  • ప్రక్షాళన చేయాల్సిందే: ట్రస్టు చైర్మన్‌ మిశ్రా

అయోధ్య, జూన్‌ 19: అయోధ్యలో రామాలయ నిర్మాణం కలను నెరవేర్చుకోవడానికి 500 ఏళ్లు ఎదురుచూశామని.. ఇప్పుడు ఆలయ నిర్మాణానికి వచ్చిన విరాళాలు మాయమయ్యాయన్న ఆరోపణల నిగ్గు తేల్చడానికి 15 రోజులు వేచిచూడలేరా అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. శుక్రవారం ఆయన రామజన్మభూమి తీర్థట్రస్టు అధ్యక్షుడు నృత్యగోపాల్‌ దాస్‌ 88వ జయంతి కార్యక్రమంలో మాట్లాడారు. విరాళాల వ్యవహారంపై సిట్‌ విచారణ కొనసాగుతోందని.. ఈ సమయంలో నిరాధార ఆరోపణలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సిట్‌పై తనకు విశ్వాసం ఉందని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. విరాళాల అవకతవకలకు సంబంధించి ఎవరి వద్దయినా ఆధారాలు ఉంటే సిట్‌కు సమర్పించాలని కోరారు. ‘అయోధ్యను అప్రతిష్ఠ పాల్జేసి.. రామజన్మభూమి తీర్థట్రస్టు కార్యకలాపాలపై అనుమానాలు రేకెత్తించేలా చేయొద్దు’ అని అభ్యర్థించారు. అయోధ్య, రామాలయ ప్రతిష్ఠను దెబ్బతీసి.. ట్రస్టు కార్యకలాపాలపై సందేహాలు రేకెత్తించే కుట్రలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. యోగి తీవ్ర స్పందనకు ప్రధాన కారణమే ఉంది. ఆలయ నిర్వహణ వ్యవస్థలో సమూల ప్రక్షాళన అవసరమని రామజన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌, మాజీ ఐఏఎస్‌ అధికారి నృపేంద్ర మిశ్రా ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల్లో అవకతవకల ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. ‘ప్రస్తుత పరిణామాలు.. ఆలయ పరిపాలనా విధానాల బలహీనతకు ఓ హెచ్చరికలాంటివి. మొత్తం నిర్వహణను ప్రక్షాళన చేసి.. అనుభవజ్ఞులకు అప్పగించాలని కోరుతున్నాం. ప్రస్తుతం వలంటీర్ల ద్వారానే ఎక్కువగా సేవలు జరుగుతున్నాయి. దీంతో జవాబుదారీతనం లోపించింది’ అని తెలిపారు. ఆయన వ్యాఖ్యలను యోగి తప్పుబట్టారు.

Updated Date - Jun 20 , 2026 | 05:54 AM