Share News

యోగాతో పురుషుల్లో వంధ్యత్వానికి చెక్‌!

ABN , Publish Date - Jun 20 , 2026 | 03:51 AM

క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల పురుషుల్లో వంధ్యత్వ సమస్యలు తగ్గి, వీర్య కణాల నాణ్యత గణనీయంగా మెరుగవుతుందని ఎయిమ్స్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.

యోగాతో పురుషుల్లో వంధ్యత్వానికి చెక్‌!

  • డీఎన్‌ఏ నష్టం తగ్గి.. వీర్య కణాల నాణ్యత మెరుగు

న్యూఢిల్లీ, జూన్‌ 19: క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల పురుషుల్లో వంధ్యత్వ సమస్యలు తగ్గి, వీర్య కణాల నాణ్యత గణనీయంగా మెరుగవుతుందని ఎయిమ్స్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని, డీఎన్‌ఏ నష్టాన్ని తగ్గిస్తుందని గుర్తించారు. పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందనే ఆధారాలకు ఈ పరిశోధన ఫలితాలు మరింత బలం చేకూరుస్తున్నాయి. ప్రపంచ యోగా దినోత్సవం(జూన్‌ 21) సందర్భంగా ఈ పరిశోధన ఫలితాలను ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ యోగాలో ప్రచురించారు. ప్రపంచవ్యాప్తంగా 15ు జంటల్లోని పురుషులు వంధ్యత్వ సమస్యను ఎదర్కొంటున్నారు. ఈ క్రమంలో ఎయిమ్స్‌కు చెందిన వైద్యులు ప్రభాకర్‌ తివారీ, రాజీవ్‌ కుమార్‌, రీమా దాదా, అంజలి యాదవ్‌ నేతృత్వంలోని బృందం ఈ అధ్యయనం చేపట్టింది. 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న 78 మంది సంతానలేమితో బాధపడుతున్న పురుషులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వారిలో 42 మంది...రోజుకు గంట చొప్పున వారానికి ఐదు రోజులపాటు యోగాసనాలు, శ్వాస వ్యాయామాలు, ధ్యానం, విశ్రాంతి.. వంటి కార్యక్రమాలను 12 వారాలపాటు చేశారు. ఈ క్రమంలో వారిలో కీలక సంతానోత్పత్తి పారామితుల్లో గణనీయమైన మెరుగుదల కనిపించినట్టు పరిశోధకులు గుర్తించారు.

Updated Date - Jun 20 , 2026 | 03:51 AM