Share News

యోగాతో ప్రపంచ శాంతి

ABN , Publish Date - Jun 22 , 2026 | 03:50 AM

భూగోళంపై నిత్యం ఏదో ఒకచోట అశాంతి, ఘర్షణలు చెలరేగుతున్న ప్రస్తుత తరుణంలో యోగ సాధన ప్రపంచానికి శాంతిని చేకూర్చగలదని ప్రధాని మోదీ అన్నారు.

యోగాతో ప్రపంచ శాంతి

  • అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సందేశం..కోల్‌కతాలో యోగాసనాలు

కోల్‌కతా/జబల్‌పూర్‌, జూన్‌ 21: భూగోళంపై నిత్యం ఏదో ఒకచోట అశాంతి, ఘర్షణలు చెలరేగుతున్న ప్రస్తుత తరుణంలో యోగ సాధన ప్రపంచానికి శాంతిని చేకూర్చగలదని ప్రధాని మోదీ అన్నారు. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలని పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కోల్‌కతాలోని రెడ్‌రోడ్డు మైదానంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. బెంగాల్‌ సీఎం సువేందు అధికారి, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, మంత్రులు, సెలబ్రిటీలతోపాటు వేలాది మంది సామాన్యులతో కలిసి ప్రధాని యోగాసనాలు వేశారు. ‘సమస్యలను అధిగమించటానికి సరైన శ్రమ, పౌష్టికాహారం, నిద్రతో కూడిన సమతుల్య జీవన విధానం అలవర్చుకోవాలి. దీనిని యోగ సాధన ద్వారా సాధించవచ్చు. యోగా శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. తద్వారా మనలో అంతర్గత శాంతిని నెలకొల్పటంతోపాటు ప్రపంచానికి శాంతినిస్తుంది’ అని మోదీ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ‘యోగా ఫర్‌ హెల్తీ ఏజింగ్‌’ అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారత త్రివిధ దళాలు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. అస్సాంలోని తేజ్‌పూర్‌లో సైన్యం నేతృత్వంలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ పాల్గొని యోగాసనాలు వేశారు. చైనా, అమెరికా, యూరప్‌, జపాన్‌, బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ తదితర దేశాల్లో భారతఎంబసీల ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.

Updated Date - Jun 22 , 2026 | 03:50 AM