Share News

2027లోనూ భారీ ఉష్ణోగ్రతలు

ABN , Publish Date - Nov 10 , 2026 | 03:28 AM

ఎల్‌నినో అత్యంత బలంగా కొనసాగుతోందని.. ఈ సమస్య సమసిపోలేదని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) హెచ్చరించింది. ఫలితంగా పేద దేశాలకు ఆహార ముప్పు మరింత పెరగనుందని..

2027లోనూ భారీ ఉష్ణోగ్రతలు

  • అత్యంత వేడి సంవత్సరాల్లో ఒకటిగా 2026 రికార్డు: డబ్ల్యూఎంవో

న్యూఢిల్లీ, నవంబరు 9: ఎల్‌నినో అత్యంత బలంగా కొనసాగుతోందని.. ఈ సమస్య సమసిపోలేదని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) హెచ్చరించింది. ఫలితంగా పేద దేశాలకు ఆహార ముప్పు మరింత పెరగనుందని, ఆకలి మరణాలు పెరుగుతాయని పేర్కొంది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలతో పోల్చుకుంటే ఈ ఏడాది ఎండలు ఠారెత్తించాయని తెలిపింది.. దీంతో నాలుగు అత్యంత వేడి సంవత్సరాల్లో 2026 సంవత్సరం కూడా ఒకటిగా నిలిచిందని డబ్ల్యూఎంవో తన నివేదికలో వివరించింది. పారిశ్రామికీకరణ కాలానికి ముందున్న ఉష్ణోగ్రతలతో పోల్చినప్పుడు సగటున 1.47 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు పేర్కొంది. ఈ అంచనా 2026 జనవరి నుంచి సెప్టెంబరు వరకు మాత్రమేనని తెలిపింది. ఈ ఏడాది సగటు ఉష్ణోగ్రత 2023, 2025 సంవత్సరాల్లో నమోదైన పూర్తిస్థాయి సగటు ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. అదేసమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన 2024తో పోలిస్తే కొంత మేరకు తక్కువగా ఉందని తెలిపింది. అయితే.. ఈ ఏడాది చివరి నాటికి ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వివరించింది. టర్కీలోని అంటాల్యాలో శుక్రవారం ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి 31వ వాతావరణ సదస్సు(కాప్-31)లో డబ్ల్యూఎంవో ఈ నివేదికను విడుదల చేసింది. ‘‘సముద్రాల ఉష్ణోగ్రతలు కూడా గత పది సంవత్సరాలుగా రికార్డులను బద్దలు కొడుతున్నాయి.’’ అని డబ్ల్యూఎంవో సెక్రటరీ జనరల్‌ సెలెస్టో సాలో తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్‌నినో అత్యంత బలమైందని, దీని కారణంగా సముద్రాల నుంచి విడుదలవుతున్న వేడిగాలులతో 2027లోనూ ఉష్ణోగ్రతలు భారీగా ఉండనున్నాయని అంచనా వేసినట్టు సెలెస్టో పేర్కొన్నారు.

Updated Date - Nov 10 , 2026 | 03:29 AM