మహిళా బిల్లుపై అమీతుమీ!
ABN , Publish Date - Apr 14 , 2026 | 04:11 AM
మరో నాలుగు రోజుల్లో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో ఈ అంశంపై వేడి రగులుకుంది....
నెగ్గించుకోవడానికి దూకుడుగా మోదీ అడుగులు.. తగినంత బలం లేకున్నా ముందుకే అంటున్న ఎన్డీఏ
ఎల్లుండి నుంచి దీనిపైనే పార్లమెంటు
21వ శతాబ్దంలో తీసుకుంటున్న అతిపెద్ద నిర్ణయం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): మరో నాలుగు రోజుల్లో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో ఈ అంశంపై వేడి రగులుకుంది. 21వ శతాబ్దిలో భారత్ తీసుకుంటున్న అతి పెద్ద నిర్ణయం మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించడం అని ఇప్పటికే ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ శతాబ్ది నారీ శక్తికి అంకితమని ప్రకటించారు. సోమవారం విజ్ఞాన్ భవన్‌లో 5వేల మంది మహిళల సమక్షంలో నిర్వహించిన ‘నారీ శక్తి వందన’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సామాజిక న్యాయం ఇక నినాదంగా కాక పని సంస్కృతిలో భాగం కాబోతోందని ప్రకటించారు. ‘నారీ శక్తి వందన చట్టం’ గురించి ఉధృతంగా గ్రామగ్రామాల్లో సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా మహిళలతో సదస్సులు నిర్వహించాలని బీజేపీ తన పార్టీ విభాగాలను ఆదేశించింది. వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యమైన మహిళా నేతలందర్నీ ఢిల్లీకి పిలిపించిన బీజేపీ ఈ వారం రోజులూ ఢిల్లీలోనే ఉండి పెద్ద సంఖ్యలో కార్యక్రమాలు చేపట్టాలని వారికి నిర్దేశించింది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగే సమయంలో మహిళలు స్వయంగా పెద్ద ఎత్తున పార్లమెంటుకు వచ్చి తిలకించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసింది.
కాంగ్రెస్‌లో తర్జనభర్జన
అయిదు రాష్ట్రాల ఎన్నికలయ్యేంత వరకూ ఈ అంశంపై చర్చించడానికి తాము సిద్ధంగా లేమని కాంగ్రెస్ ప్రకటించినప్పటికీ మోదీ పట్టించుకోక పోవడంతో ప్రధాన ప్రతిపక్షంలో ఈ అంశంపై తర్జన భర్జనలు మొదలయ్యాయి. పార్లమెంట్‌లో అవలంబించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ నెల 15న ఇతర ప్రతిపక్షాలతో సమావేశం ఏర్పాటు చేసింది. మరోపక్క ఏప్రిల్ 16న ప్రారంభమై మూడు రోజుల పాటు జరిగే సమావేశాలకు పూర్తి సంఖ్యలో హాజరు కావాలని కాంగ్రెస్ ఎంపీలకు విప్ జారీ చేసింది. అత్యంత ముఖ్యమైన ఈ సమావేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోరాదని ఆదేశించింది. మహిళా రిజర్వేషన్‌కూ, డీ లిమిటేషన్‌కూ ముడిపెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాలు కలిసివస్తే రాజ్యాంగ సవరణ బిల్లులను వ్యతిరేకించాలని భావిస్తోంది. లోక్‌సభ సీట్లను 543 నుంచి 816 సీట్లకు పెంచడం వల్ల దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీర్మానించిన విషయం తెలిసిందే. నారీ శక్తి వందనా అధినియమ్‌పై(మహిళా బిల్లు) అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయమన్నా చేయకుండా మోదీ ఒంటెత్తు పోకడతో వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ సోమవారం పత్రికలకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడానికి తాము వ్యతిరేకం కాదని, 2027 జనాభా లెక్కలకు ముందు డీలిమిటేషన్ ప్రక్రియను తాము వ్యతిరేకిస్తున్నామని సోనియాగాంధీ ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఏకపక్షంగా చేస్తున్న డీలిమిటేషన్ అత్యంత ప్రమాదకరమని, రాజ్యాంగం మీదే దాడి అని వ్యాఖ్యానించారు.

తగిన బలం ఉందా?
రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లోనూ ప్రత్యేక మెజారిటీ కావాలి. అంటే, ఓటింగ్ సమయంలో సగానికన్నా ఎక్కువ మంది సభ్యులు సభలో ఉండాలి. వారిలో మూడింత రెండొంతుల మంది బిల్లుకు అనుకూలంగా ఓటేయాలి. లోక్‌సభలో ఓటింగ్ రోజున అందరు ఎంపీలు హాజరైతే బిల్లు పాస్ కావాలంటే 362 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 292 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లుపై ఆమోదం లేకపోతే ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసేందుకు కూడా వీలు లేదు. మరోవైపు, ఈ వ్యవహారంపై ప్రతిపక్షాల బుధవారం సమావేశం కానున్నాయి.
ఇది రాజ్యాంగ వ్యతిరేకం: ఆచారి
బెంగాల్, తమిళనాడు ఎన్నికల మధ్యలో అన్ని పార్టీలు రాజకీయ ప్రచారంలో నిమగ్నమయినపుడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం సరైంది కాదని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి అన్నారు. సమావేశాలు ఏర్పాటు చేసేందుకు ఇది సరైన సమయం కాదని వ్యాఖ్యానించారు. చట్టసభల సీట్లను పెంచే డీలిమిటేషన్ విషయంపై సవివరంగా చర్చించాలని, మూడు రోజుల్లో తేల్చేది కాదని అభిప్రాయపడ్డారు. ‘‘ఇది కేవలం మహిళా రిజర్వేషన్ అంశం కాదు, చట్టసభల సీట్లను పెంచడం కూడా ఉంది. వాటితో ముడిపడ్డ అంశాలు అనేకం ఉన్నాయి. రాజకీయ పార్టీలు వాటిని అధ్యయనం చేసేందుకు, చర్చించేందుకు తగినంత సమయం కావాలి. ఇప్పటి వరకూ ఉన్న సమతుల్యం సీట్ల పెంపు తర్వాత కూడా కొనసాగుతుందా అన్నదే తేలాలి. జనాభా లెక్కల తర్వాత సీట్ల పెంపు జరగడం సరైన పద్ధతి. ఏప్రిల్ 1న జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. రాజ్యాంగంలోని82వ అధికరణం ప్రకారం జనగణన తర్వాతే జనాభా ప్రాతిపదికగా సీట్ల సర్దుబాటు జరగాలి. ఒకవైపు జనగణన జరుగుతుండగా 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికన తీసుకోవడం విచిత్రం. ఇది రాజ్యాంగ వ్యతిరేకం’’ అన్నారు.
మేం వ్యతిరేకం కాదు: ఖర్గే
మహిళా రిజర్వేషన్లకు తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే స్పష్టం చేశారు. అయితే ఈ చట్టం అమలుపై విస్తృత చర్చ జరగాల్సి ఉన్నందున దీనిపై చర్చించేందుకు ఈ నెల 15న తమ పార్టీ నేతృత్వంలో అన్ని విపక్ష పార్టీలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో అన్ని పార్టీలతో సమగ్రంగా సంప్రదింపులు జరిపేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని ఖర్గే ఆరోపించారు. ‘‘మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మద్దతు ఇస్తూనే ఉంది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని చేస్తున్న ఆరోపణలు అవాస్తవం’’ అని ఆయన అన్నారు.