డీలిమిటేషన్.. లోక్‌సభలో రెండో రోజు వాడీవేడి చర్చ
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:59 AM
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై వాడీవేడి చర్చ జరుగుతోంది. కేంద్రం తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: మహిళా రిజర్వేషన్ అమలు, లోక్‌సభ సీట్ల పెంపు బిల్లులపై పార్లమెంటులో నేడు చర్చ ప్రారంభమైంది. ప్రతిపక్షాల నిరసనల నడుమ సభ సాగుతోంది. ప్రభుత్వ తీరుపై మరోసారి ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సభలో చర్చ జరుగుతుండగా మహిళా రిజర్వేషన్‌పై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని ఆక్షేపించాయి.
కేంద్ర ప్రభుత్వం తీరుపై డీఎమ్‌కే ఎంపీ కనిమొళి మండిపడ్డారు. హోం మంత్రి అమిత్ షా పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని అన్నారు. రోజుల వ్యవధిలో బిల్లులు ఆమోదింపచేసుకోవాలనే ప్రయత్నంలో రాజకీయ లెక్కలు కనిపిస్తున్నాయని అన్నారు. ఇది అసలైన సమాఖ్య స్ఫూర్తి కాదని అన్నారు. రాష్ట్రాల హక్కులను ఈ ప్రభుత్వం గుర్తించట్లేదని అన్నారు. ఢిల్లీ సార్ల కోసమే రాష్ట్రాలు ఉన్నట్టు కేంద్రం వ్యవహరిస్తోందని అన్నారు.
కేంద్రం చర్యలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా మండిపడ్డారు. ఇది పొలిటికల్ డీమోనెటైజేషన్ అని అన్నారు. డీలిమిటేషన్‌కు మహిళా రిజర్వేషన్ బిల్లు బందీగా మారిందని అన్నారు. ఈ వ్యవహారాన్ని డీలిమిటేషన్‌తో లంకె పెట్టకూడదని అన్నారు.