Share News

33 శాతం ఇవ్వాలంటే 50 శాతం పెంచాల్సిందే!

ABN , Publish Date - Apr 15 , 2026 | 03:46 AM

చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టనుంది...

33 శాతం ఇవ్వాలంటే 50 శాతం పెంచాల్సిందే!

  • మహిళా రిజర్వేషన్‌కు పునర్విభజనతో లింకు

  • డీలిమిటేషన్‌ తర్వాతే మహిళలకు కోటా అమలు సాధ్యమంటూ రాజకీయ వర్గాల అంచనాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 : చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టనుంది. దాంతో పాటు నియోజకవర్గాల పునర్విభన(డీలిమిటేషన్‌) బిల్లు కూడా ప్రవేశపెట్టనుంది. పునర్విభజనలో భాగంగా అన్ని రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలను సగటున 50 శాతం మేర పెంచాలని కేంద్రం ఆలోచన అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. నియోజకవర్గాల పునర్విభజన చేపట్టిన తర్వాత పెరిగిన స్థానాలను ఆధారంగా తీసుకొని మహిళా రిజర్వేషన్‌ కోటాను అమలు చేయాలని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడున్న సీట్ల సంఖ్యను 50 శాతం మేర పెంచితేనే మహిళా రిజర్వేషన్‌ అమలు సాధ్యమని అభిప్రాయపడుతున్నాయి. పునర్విభజనలో నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం మేర పెంచిన తర్వాత.. మొత్తం స్థానాలపై మహిళా రిజర్వేషన్‌ అమలు చేయాలని అంటున్నాయి. ఉదాహరణకు.. తెలంగాణలో ప్రస్తుతం 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 50 శాతం లెక్క ప్రకారం పునర్విభజనలో 8 స్థానాలు పెంచాలి. అప్పుడు తెలంగాణలోని మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య 25కు పెరుగుతుంది. ఇందులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తే మహిళలకు 8 సీట్లు దక్కుతాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 50 శాతం సీట్లను పెంచితే 12 స్థానాలు పెరిగి మొత్తం సంఖ్య 37కు చేరుతుంది. ఇందులో మహిళలకు 12 సీట్లు దక్కుతాయి. అదే విధంగా 80 లోక్‌సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్‌ను తీసుకుంటే పునర్విభజనతో 40 స్థానాలు పెరిగి మొత్తం సంఖ్య120కి పెరుగుతుంది. అప్పుడు మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కింద 40 స్థానాలు దక్కుతాయి. ఈ లెక్కన పునర్విభజనతో పెరిగే స్థానాలన్నీ దాదాపుగా మహిళలకే దక్కే అవకాశం కనిపిస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Updated Date - Apr 15 , 2026 | 03:46 AM