వడివడిగా మహిళా కోటా!
ABN , Publish Date - Apr 16 , 2026 | 03:43 AM
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను సాధ్యమైనంత వేగంగా అమలు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు పార్లమెంటు ఉభయ సభలు....
నారీ శక్తి వందన అమలే లక్ష్యం
2034 కాదు.. 2029 ఎన్నికలకే ఈ చట్టం అమలుకు నిర్ణయం
3 రోజులు.. 3 కీలక బిల్లులు
నేటి నుంచి పార్లమెంటు భేటీ
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను సాధ్యమైనంత వేగంగా అమలు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేకంగా కొలువుదీరనున్నాయి. ఈ మూడు రోజుల్లో మూడు కీలక అంశాలపై చర్చించనున్నారు. సాధ్యమైనంత వేగంగా కోటా అమలు చేయడమే ఈ ప్రత్యేక భేటీ లక్ష్యమని కేంద్రం తెలిపింది. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం కోటాను అమలు చేయాలని నిర్ణయించింది. రాజ్యాంగంలోని 106వ రాజ్యాంగ సవరణ కింద తీసుకువచ్చిన ‘నారీ శక్తివందన అథినియం’ వాస్తవానికి 2023, సెప్టెంబరులోనే పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందింది. 2023, సెప్టెంబరు 20న లోక్‌సభ 454 అనుకూల ఓట్లతో దీనికి ఆమోదం తెలిపింది. కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే వ్యతిరేకించారు. రాజ్యసభలో అయితే.. 214 మంది సభ్యులు అదే ఏడాది సెప్టెంబరు 21న ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం.. సెప్టెంబరు 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో ఈ బిల్లు చట్టంగా మారింది. దీని ప్రకారం.. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అందివచ్చింది. అయితే.. ఈ చట్టం అమలుకు కొన్ని నిబంధనలు ఏర్పరిచారు. వీటి ప్రకారం.. 2034 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అదేసమయంలో కొత్తగా జనాభా లెక్కలను అనుసరించే ఈ రిజర్వేషన్‌ను అమలు చేయాలని చట్టంలో పేర్కొన్నారు. దీంతో మహిళా రిజర్వేషన్ అమలు కోసం సుదీర్ఘకాలం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2023లో చేసిన చట్టంలో పేర్కొన్న నిబంధనలను సవరించి.. 2029 ఎన్నికల నుంచే మహిళలకు కోటా ఫలాలు అందించే ప్రధాన లక్ష్యంగా గురువారం నుంచి 3రోజుల పాటు పార్లమెంటును సమావేశపరుస్తున్నారు. తద్వారా గత చట్టంలోని 3రాజ్యాంగపరమైన నిబంధలను సవరించి.. కోటా అమలుకు ఉన్న అడ్డంకులను అధిగమించాలని కేంద్రం భావిస్తోంది.
1) జనాభా లెక్కలు: మహిళా రిజర్వేషన్‌ను జనాభా లెక్కలతో సంబంధం లేకుండా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 2023 నాటి చట్టంలో జనాభా లెక్కల అనంతరమే అమలు చేయాలని పేర్కొన్నారు. దీనివల్ల 2027 వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఇదే జరిగితే.. 2029 ఎన్నికల నాటికి రిజర్వేషన్ అమలు చేసే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిని సవరించనున్నారు.
2) సీట్ల పెంపు: ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 సీట్లను 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. వీటిలో 273 సీట్లను మహిళలకు రిజర్వ్ చేయనున్నారు. ఈ పెంపు ద్వారా ఇప్పుడున్న సీట్లలో కోత పడకుండా.. కొత్తగా మహిళలకు అవకాశం కల్పించవచ్చని కేంద్రం తలపోస్తోంది. దీనిని కూడా బిల్లు రూపంలో తీసుకురానున్నారు.
3) పునర్విభజన: నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ‘నియోజకవర్గాల పునర్విభజన బిల్లు-2026’ను తీసుకురానుంది. అయితే.. ఈ విభజనకు 2011నాటి జనాభాల లెక్కలను ఆధారంగా చేసుకుని నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించనున్నారు. కానీ.. దీనిపైనే దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ వంటివి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
- సెంట్రల్ డెస్క్
విప్ జారీ
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్, జేడీయూ పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. మూడు రోజుల సమావేశాలకు ఎంపీలు విధిగా హాజరుకావాలని స్పష్టం చేశాయి. మరోవైపు.. ప్రధాని మోదీ కూడా అన్ని పార్టీల ఎంపీలకు ఈ విషయంపై విజ్ఞప్తి చేశారు. ‘‘మహిళా రిజర్వేషన్ అనేది కేవలం శాసనపరమైన ప్రక్రియ మాత్రమే కాదు. ఇది కోట్లాది మంది మహిళల ఆకాంక్షలకు ప్రతిబింబం. దీనికి మద్దతుగా అందరూ కలిసి రావాలి.’’ అని పిలుపునిచ్చారు. అయితే.. విపక్షాల వాదన భిన్నంగా ఉంది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తుండడం ఎన్నికలను ప్రభావితం చేయడమేనని కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి.