మహిళల సీట్లకు పునర్విభజనతో లింకు ఎందుకు?
ABN , Publish Date - Apr 15 , 2026 | 03:48 AM
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి, నియోజకవర్గాల పునర్విభజనకు లింకు పెట్టడం ఎందుకని ప్రభుత్వాన్ని సామాజిక ఉద్యమకారులు ప్రశ్నించారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలంటే ...
ప్రభుత్వానికి సామాజిక ఉద్యమకారుల ప్రశ్న
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి, నియోజకవర్గాల పునర్విభజనకు లింకు పెట్టడం ఎందుకని ప్రభుత్వాన్ని సామాజిక ఉద్యమకారులు ప్రశ్నించారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలంటే నియోజవర్గాల పునర్విభజన చేయకతప్పదన్న అభిప్రాయాన్ని తప్పుపట్టారు. లోక్‌సభ, అసెంబ్లీల్లో ప్రస్తుతం ఉన్న స్థానాల సంఖ్యకు అనుగుణంగానే మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండు చేశారు. సామాజిక ఉద్యమకారులు అంజలీ భరద్వాజ్, భన్వర్ మేఘవంశి, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ విమెన్ నాయకురాలు అన్నీ రాజా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ఆర్థిక శాస్త్రవేత్త సంతోష్ మెహ్రోత్రా, ప్రణాళికాసంఘం మాజీ సభ్యురాలు సయేదా హమీద్‌లు మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఈ అంశంపై విస్తృతంగా చర్చలు జరపాలని కోరారు. ఇందుకు సంబంఽధించిన బిల్లు ముసాయిదా ప్రతులను ఇంతవరకు ఎంపీలకు ఇవ్వకపోవడాన్ని, ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడాన్ని ప్రశ్నించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న సీట్లను 543 నుంచి 850 వరకు పెంచాల్సిన అవసరం ఏముందని అడిగారు. లోక్‌సభ సీట్లను 850కి పెంచితే అది ప్రపంచంలోనే అతి భారీ చట్ట సభ అవుతుందని సంతోష్ మెహ్రోత్రా అన్నారు. అది సభాకార్యకలాపాల నిర్వహణపై ప్రభావం చూపుతుందని తెలిపారు. గతంలో సభ ఏడాదిలో 150 రోజుల పాటు సభ జరిగేదని ఇప్పుడు 55 రోజులపాటు కూడా జరగడం లేదని గుర్తు చేశారు. రిజర్వేషన్లలో ఓబీసీలకు ఉప కోటా లేకపోవడాన్ని మేఘవంశీ ప్రశ్నించారు.