చట్టసభల్లో నారీ శక్తి
ABN , Publish Date - Nov 30 , 2026 | 03:27 AM
ఏడు దశాబ్దాల భారత పార్లమెంటరీ చరిత్రలో మహిళల ప్రాతినిధ్యం అతి నెమ్మదిగా అడుగులు వేస్తూ వచ్చింది. 1951-52 తొలి సార్వత్రిక ఎన్నికల్లో 22 మందితో మొదలైన..
1952లో 22మందితో మొదలైన ప్రస్థానం
ప్రస్తుత 18వ లోక్సభలో 74 మంది ప్రాతినిధ్యం
న్యూఢిల్లీ, నవంబరు 29: ఏడు దశాబ్దాల భారత పార్లమెంటరీ చరిత్రలో మహిళల ప్రాతినిధ్యం అతి నెమ్మదిగా అడుగులు వేస్తూ వచ్చింది. 1951-52 తొలి సార్వత్రిక ఎన్నికల్లో 22 మందితో మొదలైన మహిళా ఎంపీల ప్రస్థానం.. 18ఎన్నికలు గడిచినా 74మందికి మాత్రమే చేరింది. లోక్సభలో మహిళా ఎంపీల వాటా పది శాతం మార్కును అందుకోవడానికి ఏకంగా 58ఏళ్లు పట్టింది. 2009 ఎన్నికల్లో తొలిసారిగా 58మంది మహిళలు (11శాతం) గెలిచి ఆ మైలురాయిని దాటారు. ఇక, రాజ్యసభలో మహిళల వాటా లోక్సభ కంటే తక్కువగానే ఉంటూ వచ్చింది. 1951 నుంచి ఇప్పటివరకు రాజ్యసభలో మహిళల ప్రాతినిధ్యం 13శాతం దాటలేదు. అయితే, రాబోయే డీలిమిటేషన్ ప్రక్రియ, మహిళా రిజర్వేషన్ల అమలుతో ఈ లెక్కలన్నీ పూర్తిగా మారిపోనున్నాయి. ప్రస్తుత లోక్సభ స్థానాల(543) ప్రకారం 33శాతం రిజర్వేషన్లు అమలైతే కనీసం 181మంది మహిళలు ఎంపీలుగా ఎన్నికవుతారు. లోక్సభ స్థానాలను 50శాతం మేర పెంచితే సభ మొత్తం బలం 543నుంచి 824కు చేరే అవకాశం ఉందని తాజా సమాచారం. ఈ లెక్కన 275మంది(33శాతం) మహిళా ఎంపీలు పార్లమెంటులో అడుగుపెట్టే అవకాశం ఏర్పడుతుంది. ఏడు దశాబ్దాల్లో 22నుంచి 74కు మాత్రమే చేరిన మహిళా ఎంపీల సంఖ్య, తాజా ప్రతిపాదన అమలైతే ఒక్కసారిగా 4రెట్లు పెరగనుంది.