కర్ణాటకలో ఏనుగుల మధ్య ఘర్షణ.. ఏనుగు కిందపడి మహిళ దుర్మరణం
ABN , Publish Date - May 19 , 2026 | 04:01 AM
వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు చెన్నై నుంచి కర్ణాటకకు విహారయాత్రకు వచ్చిన మహిళ.. ఏనుగుల మధ్య జరిగిన ఘర్షణలో ...
బెంగళూరు, మే 18 (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు చెన్నై నుంచి కర్ణాటకకు విహారయాత్రకు వచ్చిన మహిళ.. ఏనుగుల మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయింది. ఆమెపై ఏనుగు పడిపోవడంతో ఊపిరాడక దుర్మరణం పాలైంది. కర్ణాటకలోని కొడుగు జిల్లా సోమవారపేట తాలూకాలో దుబారెలోని ప్రసిద్ధ ఏనుగుల శిబిరంలో ఈ దారుణం జరిగింది. తమిళనాడులోని చెన్నైకి చెందిన జిన్షు (33) తన భర్త, కుమార్తెతో కలిసి రెండు రోజుల పర్యటన నిమిత్తం కొడుగు జిల్లాకు వచ్చారు. సోమవారం వారు ఏనుగులను చూసేందుకు దుబారె శిబిరానికి వచ్చారు. ఎండల తీవ్రత నేపథ్యంలో మావటీలు ఏనుగులను నదిలోకి వదిలారు. దీంతో వాటిని చూసేందుకు పర్యాటకులు పెద్దసంఖ్యలో అక్కడ గుమిగూడారు. కొందరు వాటికి ఆహారాన్ని అందిస్తుండగా... కంజన్, మార్తాండ అనే ఏనుగులు ఉన్నట్టుండి ఘర్షణకు దిగాయి. కంజన్ తన దంతాలతో మార్తాండపై దాడి చేసింది. కంజన్ ధాటికి తట్టుకోలేక మార్తాండ కింద పడిపోయింది. ఈ క్రమంలో పారిపోయే ప్రయత్నంలో ఉన్న జిన్షుపై మార్తాండ ఏనుగు పడి ఆమె ప్రాణాలు విడిచారు.