Share News

ఇండియా కూటమి సంఘటితమవుతుందా?

ABN , Publish Date - May 05 , 2026 | 06:12 AM

బెంగాల్‌, అస్సాంలో బీజేపీ విజయం సాధించినప్పటికీ జాతీయస్థాయిలో 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఇండియా కూటమి సంఘటితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ఇండియా కూటమి సంఘటితమవుతుందా?

  • తాజా ఓటమితో తృణమూల్‌, డీఎంకే కాంగ్రెస్‌తోకలిసి పనిచేయాల్సిన స్థితి!

  • కేరళలో వామపక్షాలకూ ఇదే మార్గం!

న్యూఢిల్లీ, మే 4 (ఆంధ్రజ్యోతి): బెంగాల్‌, అస్సాంలో బీజేపీ విజయం సాధించినప్పటికీ జాతీయస్థాయిలో 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఇండియా కూటమి సంఘటితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. బెంగాల్‌లో దెబ్బతిన్న తృణమూల్‌ కాంగ్రెస్‌, తమిళనాడులో ఓటమిపాలైన డీఎంకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో నేతృత్వంలోని ఇండియా కూటమితో కలిసి పనిచేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఒకరు తెలిపారు. సోమవారం ఎన్నికలఫలితాలు వెలువడిన వెంటనే లోక్‌సభలో కాంగ్రెస్‌ ప్రతిపక్ష నేత రాహుల్‌.. తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్‌తో ఫోన్‌లో మాట్లాడడంతోపాటు విజయం సాధించినందుకు టీవీకే అధినేత విజయ్‌ను అభినందించడం గమనార్హం. ఇప్పటివరకు మమతా బెనర్జీ కాంగ్రెస్‌ను లెక్కచేసే వారు కాదని, ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా మారిన తృణమూల్‌ తన ఉనికిని కాపాడుకునేందుకు జాతీయస్థాయిలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయవచ్చని భావిస్తున్నారు. స్టాలిన్‌ కూడా తమకు తగిన గౌరవం ఇవ్వలేదని కాంగ్రెస్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయి. తాజా ఓటమి తో డీఎంకే కూడా కాంగ్రెస్‌తో కలిసి పని చేయా ల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భావిస్తున్నాయి. మరోవైపు.. టీవీకేకు కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, కేరళలో వామపక్షాలు పరాజయం పొందడం వల్ల జాతీయస్థాయిలో కూడా వాటి ప్రభావం తగ్గిపోతుందని, అవి కూడా కాంగ్రెస్‌తో కలిసి పనిచేయక తప్పదంటున్నారు. ఇది 2029లో కమలనాథులను సంఘటితంగా ఎదుర్కొనేందుకు బలం చేకూరుస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - May 05 , 2026 | 06:14 AM