Share News

యాసిడ్‌ దాడి నిందితుల ఆస్తులన్నీ ఎందుకు వేలం వేయకూడదు? : సుప్రీం ప్రశ్న

ABN , Publish Date - Jan 28 , 2026 | 03:10 AM

యాసిడ్‌ దాడుల కేసులకు సంబంధించి మంగళవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యాసిడ్‌ దాడికి పాల్పడ్డ నిందితుల ఆస్తులన్నింటినీ వేలం వేసి, ఆ సొమ్మును బాధితులకు పరిహారంగా ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించింది.

యాసిడ్‌ దాడి నిందితుల ఆస్తులన్నీ ఎందుకు వేలం వేయకూడదు? : సుప్రీం ప్రశ్న

న్యూఢిల్లీ, జనవరి 27: యాసిడ్‌ దాడుల కేసులకు సంబంధించి మంగళవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యాసిడ్‌ దాడికి పాల్పడ్డ నిందితుల ఆస్తులన్నింటినీ వేలం వేసి, ఆ సొమ్మును బాధితులకు పరిహారంగా ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించింది. యాసిడ్‌ దాడి బాధితురాలు, బ్రేవ్‌ సోల్స్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు షహీన్‌ మాలిక్‌ దాఖలు చేసిన ‘పిల్‌’పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. బాధితులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.3 లక్షల పరిహారం దీర్ఘకాలిక చికిత్సకు, పునరావాసానికి ఏమాత్రం సరిపోదని తెలిపింది. ‘ఇలాంటి క్రూర నేరాలకు పాల్పడేవారికి అసాధారణ రీతిలో బాధ కలిగించే శిక్ష విధించాల్సి ఉంద’ని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. వరకట్నం హత్య కేసుల తరహాలో వీటిని చూడాల్సి ఉందని తెలిపారు. అన్ని యాసిడ్‌ దాడుల కేసుల వివరాలను 4వారాల్లో సమర్పించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టు సహా అన్ని కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సమాచారాన్ని కూడా ఇవ్వాలని తెలిపింది. నిందితులకు కఠిన శిక్షలు పడేలా అవసరమైతే చట్టంలో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

Updated Date - Jan 28 , 2026 | 03:10 AM