‘హౌస్ వైఫ్’లాగే.. ‘హౌస్ హజ్బెండ్’ ఎందుకు ఉండకూడదు..?: మద్రాసు హైకోర్టు
ABN , Publish Date - Sep 25 , 2026 | 06:10 AM
సమాజంలో ‘హౌస్ వైఫ్’ ఉన్నట్లుగానే ‘హౌస్ హజ్బెండ్’ ఎందుకు ఉండకూడదని.. మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది.
చెన్నై, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): సమాజంలో ‘హౌస్ వైఫ్’ ఉన్నట్లుగానే ‘హౌస్ హజ్బెండ్’ ఎందుకు ఉండకూడదని.. మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. మహిళలు వృత్తికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వివాహాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, భర్తలు గృహస్థులుగా మారడమే దీనికి పరిష్కారమని పేర్కొంది. తిరువణ్ణామలై జిల్లాకు చెందిన వైద్య దంపతుల వైవాహిక వివాదాన్ని పరిష్కరిస్తూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఒకప్పుడు సాంప్రదాయకంగా భర్త ఆర్థిక వనరులు సమకూర్చడం, భార్య గృహ వ్యవహారాలను చూసుకోవడం వంటివి ఉండేవని, కానీ.. కొన్ని దశాబ్దాలుగా ఈ పాత్రలు మారిపోయాయని న్యాయమూర్తులు జస్టిస్ జీఆర్ స్వామినాధన్, జస్టిస్ ఎండీ సుమతిల మదురై ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మార్పు అనేక సంబంధాలను ప్రభావితం చేస్తోందని తెలిపింది. గృహిణులైన భార్యలు ఉండగలిగినప్పుడు, గృహస్తులైన భర్తలు కూడా ఉండవచ్చని... ఇదొక ‘కొత్త సాధారణం’ కావాలని వ్యాఖ్యానించింది.