ముందున్నది ఆరోగ్య సంక్షోభం
ABN , Publish Date - Sep 20 , 2026 | 06:08 AM
ప్రపంచ వ్యాప్తంగా రిటైర్మెంట్‌కు దగ్గరవుతున్న డాక్టర్ల సంఖ్య పెరుగుతున్న కారణంగా ఆరోగ్య వ్యవస్థల్లో సిబ్బంది కొరత ఏర్పడబోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ..
వచ్చే పదేళ్లలో.. ఇప్పుడున్న డాక్టర్లలో 25శాతం మంది ఉద్యోగ విరమణ
చాలా దేశాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు సిబ్బంది లేరు: డబ్ల్యూహెచ్‌వో
న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: ప్రపంచ వ్యాప్తంగా రిటైర్మెంట్‌కు దగ్గరవుతున్న డాక్టర్ల సంఖ్య పెరుగుతున్న కారణంగా ఆరోగ్య వ్యవస్థల్లో సిబ్బంది కొరత ఏర్పడబోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. దీని కారణంగా వచ్చే దశాబ్దంలో డజన్ల కొద్దీ దేశాల్లో వైద్యుల లోటు ఏర్పడి ఆరోగ్య సంక్షోభం ఏర్పడబోతోందని స్పష్టం చేసింది. హెల్త్ వర్క్‌ఫోర్స్ లెవెల్స్, ట్రెండ్స్-2026 పేరుతో డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రచురించింది. నేషనల్ హెల్త్ వర్క్‌ఫోర్స్ అకౌంట్స్(ఎన్‌హెచ్‌డబ్ల్యూఏ) డేటా ఆధారంగా ఆ నివేదిక రూపొందించింది. 2006లో సగటున ప్రతి 10వేల మంది ప్రజలకు 44.8 వైద్య సిబ్బంది ఉండగా, 2025 నాటికి అది 67.9 శాతానికి పెరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 7కోట్ల మందికి పైగా వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు. కానీ, చాలా దేశాల్లో వారి స్థానాన్ని భర్తీ చేసే కొత్త సిబ్బంది తయారు కావడంలేదని డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. 122 దేశాల డేటాను విశ్లేషించింది. ఆయా దేశాల్లో సుమారు 25ు మంది డాక్టర్లు 55 లేదా అంతకంటే ఎక్కువ వయసు వారు ఉన్నారని, వీరు వచ్చే దశాబ్దానికల్లా రిటైర్ కాబోతున్నారని వెల్లడించింది. దీంతో, 2030 నాటికి 67 దేశాల్లో తమ దేశ అవసరాలను తీర్చడానికి తగినంతమంది ఆరోగ్య కార్యకర్తలు ఉండరని తెలిపింది.