Share News

భారత పోలియో వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం

ABN , Publish Date - Feb 16 , 2026 | 04:13 AM

కొత్త రకం పోలియో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లోని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బయోలాజికల్‌-ఈ లిమిటెడ్‌ సంస్థ అభివృద్ధి చేసిన కొత్త ఓరల్‌ పోలియో వ్యాక్సిన్‌......

భారత పోలియో వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం

  • బయోలాజికల్‌-ఈ సంస్థ ఎన్‌వోపీవో-2కు ప్రీక్వాలిఫికేషన్‌

జెనీవా, ఫిబ్రవరి 15: కొత్త రకం పోలియో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లోని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బయోలాజికల్‌-ఈ లిమిటెడ్‌ సంస్థ అభివృద్ధి చేసిన కొత్త ఓరల్‌ పోలియో వ్యాక్సిన్‌ (ఎన్‌వోపీవీ-2)కు ప్రీక్వాలిఫికేషన్‌(పీక్యూ) ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించడంతో డబ్లూహెచ్‌వో దీనికి అనుమతి ఇచ్చింది. టైప్‌-2 పోలియో వైరస్‌ రకం వ్యాప్తిని అరికట్టడానికి, మెరుగైన జన్యు స్థిరత్వాన్ని అందించడానికి ఎన్‌వోపీవీ-2ను తయారు చేశారు. డబ్లూహెచ్‌వో ఆమోదం లభించడంతో.. బయోలాజికల్‌-ఈ సంస్థ ఏడాదికి 600 మిలియన్‌ డోసుల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయగలదని అంచనా వేస్తున్నారు. ఇండోనేషియాకు చెందిన పీటీ బయో ఫార్మా నుంచి సాంకేతికతను పొందిన బయోలాజికల్‌-ఈ సంస్థ సొంతంగా ఈ టీకాలు ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా యూనిసెఫ్‌ సహా ఐరాస ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలు ఈ టీకాలను కొంటాయి.

ఎన్‌వోపీవో-2 అత్యంత సురక్షితం..

‘నోవెల్‌ ఓరల్‌ పోలియో వ్యాక్సిన్‌’ (ఎన్‌వోపీవో-2) అనేది జన్యుపరమైన మార్పులు చేసిన కొత్తరకం పోలియో వ్యాక్సిన్‌. సాధారణ పోలియో టీకాలతో పోలిస్తే ఇది అత్యంత సురక్షితమైనది. కొత్తరకం పోలియో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో ఇది జన్యుపరంగా అధిక స్థిరత్వం కలిగి ఉంటుంది. 1980ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా సాగిస్తున్న పోరాటంతో పోలియో 99 శాతానికిపైగా తగ్గింది. అయితే ఆఫ్రికా, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల పోలియో వైరస్‌ కేసులు బయటపడ్డాయి.

Updated Date - Feb 16 , 2026 | 04:13 AM