వాట్సాప్ వినియోగదారులారా జర భద్రం
ABN , Publish Date - Jun 29 , 2026 | 04:14 AM
వాట్సాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మాల్‌వేర్‌తో పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నారని జాతీయ....
కొందరి వాట్సాప్ ఖాతాలను హ్యాక్‌చేసి వారి సన్నిహితులకు మాల్‌వేర్ ఉన్న వీబీ స్ర్కిప్ట్ ఫైళ్లను పంపుతున్న సైబర్ నేరగాళ్లు
ఆ ఫైళ్లను తెరిస్తే ఫోన్ వారి అధీనంలోకి వెళ్లినట్టే!
ప్రజలకు జాతీయ సైబర్ సెక్యూరిటీ సంస్థ సెర్ట్-ఇన్ హెచ్చరిక
న్యూఢిల్లీ, జూన్ 28: వాట్సాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మాల్‌వేర్‌తో పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నారని జాతీయ సైబర్ భద్రత సంస్థ అయిన సెర్ట్-ఇన్ (ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) హెచ్చరించింది. రకరకాల ప్రలోభాలతో తొలుత కొందరి వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఆయా వ్యక్తుల ఖాతాల నుంచి వారి స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యుల వాట్సాప్ ఖాతాలకు హానికరమైన విజువల్ బేసిక్ స్ర్కిప్ట్ (డాట్ వీబీఎస్) ఫైళ్లను పంపుతున్నారని.. కాబట్టి, ఎంత తెలిసినవారి నుంచి వచ్చిన వాట్సాప్ సందేశాన్నైనా, అటాచ్‌మెంట్‌నైనా తెరిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సెర్ట్-ఇన్ సూచించింది. పొరపాటున అలాంటి అటాచ్‌మెంట్లను తెరిస్తే ఫోన్ కాస్తా సైబర్ నేరగాళ్ల అధీనంలోకి వెళ్లిపోతుందని.. ఆ ఫోన్‌లో అప్పటికే సేవ్ చేసి ఉన్న పాస్‌వర్డ్‌లు, ఐడీల సాయంతో వారు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తారని, ఇతరత్రా మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడతారని హెచ్చరించింది. ఒకవేళ తెలిసిన వ్యక్తుల దగ్గర్నుంచీ ‘డాట్ వీబీఎస్’ ఫైళ్లు లేదా అనుమానాస్పద అటాచ్‌మెంట్ల వంటివి ఏవైనా వస్తే.. వెంటనే వారికి ఫోన్ చేసి వారు నిజంగానే వాటిని పంపారో లేదో ధ్రువీకరించుకోవాలని సూచించింది.