వారికి 12 ఏళ్ల పాటు ఓటు లేనట్టే!
ABN , Publish Date - Sep 22 , 2026 | 04:15 AM
పశ్చిమబెంగాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ద్వారా తొలగింపునకు గురైన ఓటర్లు ఓటు కోసం ఏళ్లపాటు నిరీక్షించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
బెంగాల్లో సర్‌లో తొలగింపునకు గురైన వారి పరిస్థితి
37లక్షల అప్పీళ్ల పరిష్కారంపై సుప్రీంలో ఈసీ అఫిడవిట్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: పశ్చిమబెంగాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ద్వారా తొలగింపునకు గురైన ఓటర్లు ఓటు కోసం ఏళ్లపాటు నిరీక్షించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఓటర్ల జాబితాల్లో తమ పేర్లను చేర్చాలని కోరుతూ వీరు దాఖలు చేసిన అప్పీళ్లను పరిష్కరించడానికి ట్రైబ్యునళ్లకు 12సంవత్సరాలు పట్టొచ్చని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొనడం గమనార్హం. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ట్రైబ్యునళ్లు ఈ ఏడాది ఏప్రిల్ మధ్య నుంచి పని చేయడం ప్రారంభించగా.. గత ఐదు నెలల్లో అవి 1,26,194 దరఖాస్తులపై నిర్ణయం తీసుకున్నాయని తెలిపింది. నెలలో సగటున 25,238 కేసులను పరిష్కరిస్తున్నాయని.. ఈ ప్రకారం చూస్తే, ఒకవేళ ట్రైబ్యునళ్లు వారంలో అన్ని రోజులు పనిచేసినా మిగిలిన 37.05 లక్షల అప్పీళ్లను పరిష్కరించడానికి 146నెలల సమయం తీసుకుంటుందని వివరించింది. ఈ స్థాయిలో దరఖాస్తుల పరిశీలనకు ట్రైబ్యునళ్ల సంఖ్య, సదుపాయాలు చా లవని పేర్కొంది. ప్రస్తుత ట్రైబ్యునళ్ల సంఖ్యను 24నుంచి 42కు పెంచడం ద్వారా ఎక్కువ సంఖ్యలో అప్పీళ్లను పరిష్కరించవచ్చని తెలిపింది.