ఎస్‌ఐఆర్ ప్రభావం ఎంత?
ABN , Publish Date - May 05 , 2026 | 04:35 AM
పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల ముంగిట ఓటర్ల జాబితా సవరణ
తమ మద్దతువర్గమైన ముస్లింల ఓట్ల తొలగింపునకే చేపట్టారని తృణమూల్ ఆరోపణ ..
బంగ్లాదేశ్ చొరబాటుదారులే లక్ష్యమన్న బీజేపీ.. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా సుప్రీంలో మమత వాదనలు
ఓటు హక్కు కోల్పోయిన లక్షలాదిమంది .. తృణమూల్ ఓటమి ప్రధాన కారణాల్లో ఇదొకటి!
పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.6 కోట్లు కాగా.. దాంట్లో 90 లక్షల మంది పేర్లను ఈ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. మొత్తం ఓటర్లలో వీరు ఏకంగా 12 శాతం ఉండటం గమనార్హం. ఈ 90 లక్షల ఓటర్లలో చనిపోయిన వాళ్లు, ఆచూకీ లేని వాళ్ల పేర్లు 60 లక్షలకు పైగా ఉన్నాయి. మిగిలిన 27 లక్షల మంది ఓటర్ల వివరాలు సందేహాస్పదంగా ఉన్నాయని ఈసీ వారిని పక్కనపెట్టింది. సంబంధిత ట్రైబ్యునళ్లలో అప్పీల్ చేసుకొని, ఓటు హక్కును తిరిగి పొందే అవకాశం కల్పించారు. కానీ, దీని ద్వారా ఎంతమంది తిరిగి ఓటు హక్కును సాధించుకున్నారన్న దానిపై స్పష్టత లేదు. ఓటర్ల జాబితా నుంచి అక్రమ బంగ్లాదేశీ వలసదారులను తొలగించటమే లక్ష్యంగా ఎస్‌ఐఆర్‌ను చేపట్టినట్లుగా ప్రధాని మోదీ దగ్గరి నుంచి పలువురు బీజేపీ నేతలు పేర్కొన్నారు. అయితే, బయటకు అలా చెప్పినప్పటికీ.. తమ పార్టీకి బలమైన మద్దతుదారులైన ముస్లిం ఓటర్లను తొలగించటమే లక్ష్యంగా ఎస్‌ఐఆర్ నిర్వహిస్తున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ వివాదం పెరిగిపోయి సుప్రీంకోర్టును చేరింది. అయితే, ఎస్‌ఐఆర్‌ను అడ్డుకోవటానికి నిరాకరించిన సుప్రీంకోర్టు.. ఓట్లు కోల్పోయిన వారికి ఓటు హక్కు పునరుద్ధరణ దిశగా చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘానికి కొన్ని సూచనలు చేసింది. అయినప్పటికీ, పోలింగ్ నాటికి లక్షలాది మంది ఓట్లు గల్లంతయ్యాయన్న వార్తలు వెలువడ్డాయి. ఈసీ అభ్యంతరాలతో ఓటు హక్కు గందరగోళంలో పడిన 27 లక్షల మందిలో 65 శాతం మంది ముస్లింలే. ఇక మొత్తంగా ఈసీ తొలగించిన 90 లక్షల ఓటర్లలో ముస్లింలు 31 లక్షల మంది (34శాతం). ఎస్‌ఐఆర్ ప్రక్రియ జరిపిన మధ్యప్రదేశ్ కూడా వివరాలు సందేహాస్పందంగా ఉన్నాయంటూ భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లను ఈసీ ప్రకటించింది. అయితే, ఇక్కడ ఎన్నికలకు రెండేళ్ల వ్యవధిలో ఉన్నందున.. సదరు వ్యక్తులకు తమ వివరాలను ఈసీకి సమర్పించి, ఓటు హక్కును పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. కానీ, బెంగాల్‌లో ఎన్నికల ముంగిట ఎస్‌ఐఆర్ అమలు వల్ల చాలా మందికి ఆ అవకాశం లభించకుండా పోయింది. తృణమూల్ మద్దతుదార్లయిన ముస్లింల ఓట్లను తీసేయడం ఆ పార్టీ ఓటమికి గల కారణాల్లో ఒకటనే వాదన వినిపిస్తోంది.
ఎస్‌ఐఆర్‌కు ముందు మొత్తం ఓటర్లు 7.6 కోట్లు
90లక్షలు (వీరిలో ముస్లింలు 34శాతం) ఎస్‌ఐఆర్‌తో తొలగించిన పేర్లు
తొలగింపునకు గురైన 90 లక్షల మందిలో మృతులు, ఆచూకీ లేనివారు 63 లక్షలు
27లక్షలు (వీరిలో ముస్లింలు 65శాతం) వివరాలు సందేహాస్పదంగా ఉన్నవారు