Share News

బెంగాల్‌ మళ్లీ తృణమూల్‌దే

ABN , Publish Date - Mar 24 , 2026 | 04:42 AM

పశ్చిమ బెంగాల్‌లో అధికారం మళ్లీ తృణమూల్‌ కాంగ్రెస్‌దే అని వోట్‌ వైబ్‌ అనే సంస్థ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌ వెల్లడించింది. 294 స్థానాలున్న బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో..

బెంగాల్‌ మళ్లీ తృణమూల్‌దే

  • 184-194సీట్లు వస్తాయి.. బీజేపీకి 108దాకా రావొచ్చు

  • అసోంలో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధిస్తుంది

  • వోట్‌వైబ్‌ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్స్‌లో వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 23: పశ్చిమ బెంగాల్‌లో అధికారం మళ్లీ తృణమూల్‌ కాంగ్రెస్‌దే అని వోట్‌ వైబ్‌ అనే సంస్థ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌ వెల్లడించింది. 294 స్థానాలున్న బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి 184-194 సీట్లు వస్తాయని తెలిపింది. పశ్చిమబెంగాల్‌లో అధికారం కోసం చెమటోడుస్తున్న బీజేపీకి 98-108 స్థానాలు వస్తాయని పేర్కొంది. లెఫ్ట్‌ పార్టీలకు 1-3సీట్లు రావొచ్చని అంచనా వేసింది. ఇక ఈశాన్య రాష్ట్రమైన అసోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధిస్తుందని, ఈ కూటమి 80-90సీట్లలో గెలుస్తుందని ఇదే సంస్థ నిర్వహించిన మరో ఒపీనియన్‌ పోల్‌ తెలిపింది. అసోంలో మొత్తం 126అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఇండియా కూటమికి 29-39సీట్లు రావొచ్చని అంచనా వేసింది. తమిళనాడులో అగ్ని న్యూస్‌ సర్వీ్‌స(ఏఎస్ఎస్‌) ఒపీనియన్‌ పోల్‌ నిర్వహించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమికి 180సీట్లు వరకు రావొచ్చని ఈ పోల్‌ వెల్లడించింది. బీజేపీ భాగస్వామిగా ఉన్న అన్నాడీఎంకేకు 50-60స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది. నటుడు విజయ్‌ టీవీకే పార్టీకి 10శాతం ఓట్లు రావొచ్చని పేర్కొంది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. కేరళలో మ్యాట్రిజ్‌-ఐఏఎన్‌ఎస్ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌లో.. అధికార, వామపక్ష ఎల్డీఎఫ్‌ కూటమికి, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమికి మధ్య గట్టి పోటీ ఉందని తేలింది. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఎల్డీఎఫ్‌ కూటమికి 61-71 స్థానాలు, యూడీఎఫ్‌ కూటమికి 58-69 స్థానాలు, ఎన్డీయేకు 2స్థానాలు వస్తాయని ఈ ఒపీనియన్‌ పోల్‌ వెల్లడించింది.

Updated Date - Mar 24 , 2026 | 04:42 AM