టీఎంసీ నేతలపై కొనసాగుతున్న దాడులు
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:05 AM
తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన గంటల్లోనే ఆ పార్టీ చీఫ్ విప్ కల్యాణ్ బెనర్జీపై కూడా దాడి జరిగింది. హూగ్లీ జిల్లా ...
మొన్న అభిషేక్... నిన్న కల్యాణ్ బెనర్జీ
అభిషేక్‌పై దాడికి పాల్పడిన ఐదుగురి అరెస్ట్ ...అందరూ టీఎంసీ మాజీ ఎమ్మెల్సీ లవ్‌లీ మైత్రా అనుచరులే
కోల్‌కతా, మే 31: తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన గంటల్లోనే ఆ పార్టీ చీఫ్ విప్ కల్యాణ్ బెనర్జీపై కూడా దాడి జరిగింది. హూగ్లీ జిల్లా చండితాలా పోలీస్ స్టేషన్ ఆవరణలో టీఎంసీ-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ సందర్భంగా పోలీసులు పిలిచి మాట్లాడుతుండగా కల్యాణ్ బెనర్జీ తలకు రాయి తగిలి గాయమైంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమ పార్టీ కార్యకర్తలపై బీజేపీ శ్రేణులు దాడి చేశాయని ఆయన ఆరోపించారు. 10-15 మంది కాషాయ కండువలు ధరించిన బీజేపీ కార్యకర్తలు తనపై దాడి చేశారని, అందులో ఒక కార్యకర్త తనపై రాయి విసిరాడని ఆయన ఆరోపించారు. తనపై దాడి జరుగుతున్నా పోలీసులు చోద్యం చూశారంటూ ఆయన పోలీస్ స్టేషన్ బయట ఆందోళనకు దిగారు. దాడి ఘటనపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. దాడి నేపథ్యంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనతో ఫోన్‌లో మాట్లాడారని, అవసరమైతే మెరుగైన చికిత్స కోసం అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిద్దామన్నారని మమత చెప్పారు. మరోవైపు, అభిషేక్ బెనర్జీపై దాడి చేసింది టీఎంసీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ లవ్‌లీ మైత్రా అనుచరులేనని పోలీసులు తేల్చారు. దాడికి పాల్పడిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. టీఎంసీ నాయకత్వంలో ఉన్న విభేదాల కారణంగానే అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిందని బీజేపీ నేత ప్రదీప్ భండారీ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.