బెంగాల్లో మత ఆధారిత పథకాలకు స్వస్తి
ABN , Publish Date - May 19 , 2026 | 04:09 AM
పశ్చిమ బెంగాల్‌లో మత ఆధారిత సంక్షేమ పథకాలకు ముగింపు పలకాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మదర్సా విభాగం ఆధ్వర్యంలో ...
ఇమామ్‌లు, పూజారులకు గౌరవ భృతి నిలిపివేత
కోల్‌కతా, మే 18: పశ్చిమ బెంగాల్‌లో మత ఆధారిత సంక్షేమ పథకాలకు ముగింపు పలకాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మదర్సా విభాగం ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలను నిలిపివేయనుంది. సోమవారం సీఎం సువేందు అధికారి అధ్యక్షతన జరిగిన రెండో మంత్రివర్గ సమాశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచార శాఖ మంత్రి అగ్నిమిత్ర పౌల్ చెప్పారు. మమత బెనర్జీ ప్రభుత్వం ఇమామ్‌లకు నెలకు రూ.3 వేలు, ముజ్జియిన్లు, పూజారులకు రూ.2,000 వంతున చెల్లిస్తుండగా వాటిని నిలిపివేయనుంది. ఈ నిర్ణయం జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్‌షి్‌పలు మాత్రం కొనసాగుతాయి. అదే రోజు నుంచి అన్నపూర్ణ యోజన కింద మహిళలకు రూ.3,000 వంతున ఆర్థిక సాయం చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటికే మమత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన లక్ష్మీ భండార్ కింద సహాయం పొందుతున్న మహిళలకు ఆటోమేటిక్‌గా ఈ పథకం వర్తిస్తుంది. జూన్ ఒకటో తేదీ నుంచే బెంగాల్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఓబీసీ కులాల జాబితాను కూడా రద్దు చేసినట్టు మంత్రి అగ్నిమిత్ర చెప్పారు. ఓబీసీ జాబితాలో 77 కులాలను కలపగా అందులో 75 ముస్లిం కులాలు ఉండడంతో వివాదం నెలకొంది. ఉద్యోగుల జీతభత్యాల విషయమై ఏడో వేతన సవరణ సంఘాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. మరోవైపు సువేందు బీజేపీ కార్యాలయంలో జనతా దర్బారు నిర్వహించి విద్యార్థులు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.