సీఎం పీఠం ఎవరికి
ABN , Publish Date - May 05 , 2026 | 04:32 AM
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ అధినేత్రి మమత కోటను బద్దలు కొట్టి బీజేపీ అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రి పీఠం ఎవరిని వరించనుందనే అంశంపై ...
రేసులో ముందున్న సువేందు అధికారి
జాబితాలో దిలీప్ ఘోష్, షామిక్ భట్టాచార్య పేర్లు
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ అధినేత్రి మమత కోటను బద్దలు కొట్టి బీజేపీ అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రి పీఠం ఎవరిని వరించనుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. గత ఎన్నికలకు భిన్నంగా బీజేపీ అధిష్ఠానం ఇక్కడ సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించలేదు. దీంతో పాలనా పగ్గాలు చేపట్టే సామర్థ్యం ఉన్న పలువురు కీలక నాయకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే రాష్ట్రంలో బీజేపీ కీలక నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సువేందు ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌లో మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. టీఎంసీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు పార్టీలో రెండో శక్తిమంతమైన నేతగా ఎదిగారు. టీఎంసీలో అంతర్గత విభేదాల కారణంగా 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి కూడా పోటీకి దిగిన దీదీని ఓడించడం ద్వారా సువేందు ప్రకంపనలు రేపారు. ఆ తర్వాతఆయన అసెంబ్లీలో విపక్ష నేతగా ఎన్నికయ్యారు. సీఎం పదవికి ఆయనే సమర్థుడని భావించడానికి ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇక బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడైన దిలీప్ ఘోష్ కూడా సీఎం పదవికి రేసులో నిలిచారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఆయన హయాంలోనే వామపక్షాల స్థానాన్ని ఆక్రమించి బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. అలాగే బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు షామిక్ భట్టాచార్యతో పాటు దక్షిణ అసన్‌సోల్ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అగ్నిమిత్ర పాల్, సిలిగురి ఎమ్మెల్యే శంకర్ ఘోష్ పేర్లను కూడా బీజేపీ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉంది.