తెలుగు రాష్ట్రాలపై యుద్ధం దెబ్బ!
ABN , Publish Date - Mar 10 , 2026 | 05:07 AM
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం భారత వ్యవసాయోత్పత్తులకు ముప్పుగా పరిణమిస్తోంది. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పశ్చిమాసియాకు జరుగుతున్న ఎగుమతులను తీవ్ర స్థాయిలో....
పశ్చిమాసియాకు ఆహార ఉత్పత్తుల ఎగుమతులు బంద్
హోర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగితే భారత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కకావికలం
గతేడాది భారత్ నుంచి రూ.లక్ష కోట్ల విలువైన బియ్యం సరఫరా.. ప్రపంచ ఎగుమతుల్లో 36.7శాతం
పోర్టుల్లోనే 4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం
అక్కడే మగ్గుతున్న పండ్లు, కూరగాయలు, రొయ్యలు, చేపలు, మాంసం ఉత్పత్తులు
న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 9 (ఆంధ్ర జ్యోతి): ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం భారత వ్యవసాయోత్పత్తులకు ముప్పుగా పరిణమిస్తోంది. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పశ్చిమాసియాకు జరుగుతున్న ఎగుమతులను తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తోంది. భారత్ నుంచి ఆ ప్రాంత దేశాలకు గతేడాది రూ.1,08,898 కోట్ల విలువైన ఆహారోత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఇది మనదేశ మొత్తం వ్యవసాయ ఎగుమతుల్లో ఐదో వంతుకు పైమాటే. ముఖ్యంగా రూ.40,876 కోట్ల విలువైన బియ్యం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హరియాణా, కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్ర నుంచే సరఫరా అయ్యాయి. భారత్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యే బియ్యంలో ఇది 36.7 శాతం కావడం గమనార్హం. కాగా, ఎగుమతి, దిగుమతుల రవాణా సాగే హోర్ముజ్ జలసంధి.. యుద్ధం కారణంగా మూతబడడంతో చమురు కంటెయినర్లతోపాటు 4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం పోర్టుల్లోనే నిలిచిపోయింది. కొన్ని కంటెయినర్లు సముద్ర మార్గాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. రాకపోకలు మరికొంత కాలం స్తంభిస్తే.. భారతీయ రైతులు తీవ్రంగా నష్టపోవడం ఖాయం. మన వ్యవసాయోత్పత్తుల ఎగుమతులన్నీ గల్ఫ్, పశ్చిమాసియా మార్కెట్‌పైనే ఆధారపడి ఉన్నాయి. వీటిలో తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులే అధికం. మన బాస్మతి బియ్యానికి అతిపెద్ద కొనుగోలుదారులు సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్ దేశాలే. ‘హోర్ముజ్ జలసంధి వద్ద అనిశ్చితి కొనసాగితే.. భారత వ్యవసాయ ఎకానమీకి ప్రమాద ఘంటికలే. ఎగుమతులకు ఒక్క ప్రాంతంపైనే ఆధారపడకుండా విభిన్న మార్కెట్లను అన్వేషించుకోవలసిన అవసరాన్ని తాజా పరిస్థితులు నొక్కిచెబుతున్నాయి’ అని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్‌ఐ) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ అన్నారు.

నడిసంద్రంలో నావలు..
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం వల్ల.. మన దేశం నుంచి ఎర్రసముద్రం, పశ్చిమాసియాకు కంటెయినర్ల ద్వారా ఎగుమతి అయ్యే ఆహార ఉత్పత్తులు పోర్టుల్లో నిలిచిపోయాయి. దీనివల్ల దుబాయ్, ఇతర అరబ్ దేశాలకు పండ్లు, మాంసం ఉత్పత్తులు, గుడ్లు, పాలు వంటి ఎగుమతులు పెద్ద ఎత్తున ఆగిపోయాయి. ఎగుమతిదారుల సంఘాల నివేదికల ప్రకారం.. యుద్ధం ప్రారంభం కాకముందు ఉద్రిక్తతలు తలెత్తే సమయానికి.. మన దేశంలో ఉన్న ప్రధాన ఓడరేవుల నుంచి గల్ప్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, కువైట్ దేశాలకు రోజూ జవహర్‌లాల్ నెహ్రూ పోర్టు, ముంద్రా వంటి ప్రధాన పోర్టుల నుంచి 2500-3000 కంటెయినర్ల ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. ఇందులో ముఖ్యంగా పెరిషబుల్ గూడ్స్ (త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలు) గుడ్లు, పండ్లు, కూరగాయలు, మాంసం ఉత్పత్తుల వాటా 25 శాతం ఉండేది. అయితే యుద్ధభయం, సముద్ర మార్గంలో దాడులు జరుగుతాయనే హెచ్చరికల నేపథ్యంలో.. రోజువారీ ఎగుమతి అయ్యే కంటెయినర్ల సంఖ్య 1200 నుంచి 1500కు పడిపోయినట్లు పోర్టు అధికారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో జరిగే ఎగుమతులతో పోల్చితే ప్రస్తుతం జరుగుతున్న ఎగుమతులు 40 నుంచి 50 శాతం క్షీణించాయని ఎగుమతిదారుల సంఘాల సమాచారం.
నష్టపోతున్న రైతులు..
పెరిషబుల్ గూడ్స్ ఉత్పత్తుల ఎగుమతి నిలిచిపోవడం వల్ల మన రైతులు కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఎదురైందని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి దుబాయ్‌కి ఎగుమతి చేసిన సుమారు 800 కంటెయినర్ల ద్రాక్ష.. పోర్టుల్లో నిలిచిపోయింది. దుబాయ్‌లో ఉన్న జెబెల్ అలీ పోర్టుకు చేరిన కంటెయినర్ల నుంచి సరుకు దించకపోవడం వల్ల కూడా భారీగా నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. మన దేశంలో ఉన్న పోర్టుల్లో నిలిచిపోయిన కంటెయినర్లలో సుమారు 10 వేల టన్నుల ద్రాక్ష ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, కాకినాడ, చెన్నై, కృష్ణపట్నం ఓడ రేవుల నుంచి చేపలు, రొయ్యలతోపాటు బియ్యం ఎగుమతి పెద్ద ఎత్తున జరుగుతుంది. సుమారు 3 లక్షల టన్నుల బియ్యం ఎగుమతులు మార్గమధ్యంలో నిలిచిపోయాయి. ఉల్లిపాయలు, అరటి వంటివి 300 ఏసీ కంటెయినర్లలో నిలిచిపోయాయని, ఒక్క జవహర్‌లాల్ నెహ్రూ పోర్టులోనే 10వేల టన్నుల పండ్లు ఆగిపోయినట్లు పోర్టు అధికారుల సమాచారం. ముంబయి, గుజరాత్, చెన్నై పోర్టుల నుంచి సుగంధ ద్రవ్యాల ఎగుమతి కూడా అధికంగా ఉంటుందని, ఇప్పుడు ఇవన్నీ పోర్టుల్లో నిలిచిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
రంజాన్ వేళ... ఎగుమతుల్లో స్తబ్ధత
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న మాంసం, రొయ్యలు, పండ్లు, కూరగాయలు గల్ఫ్ దేశాలకు నిలిచిపోవడంతో ఆయా దేశాల్లో రంజాన్ వేళ స్టాక్ తగ్గిపోయి.. మార్కెట్‌లో స్తబ్ధత నెలకొందని ఎగుమతిదారులు చెబుతున్నారు. రంజాన్ సమయంలో ఇఫ్తార్ విందులో భాగంగా పండ్లు, మాంసం ఉత్పత్తుల వినియోగం అధికంగా ఉంటుందని, అయితే యుద్ధ వాతావరణం వల్ల ఒమన్, కువైట్, సౌదీ దేశాల్లో ఎగుమతులు, ఓడల నిర్వహణ చేసే పెద్ద కంపెనీలు ఆర్డర్లు నిలిపివేశాయని అధికారులు చెబుతున్నారు. కాగా, యుద్ధవాతావరణం వల్ల పోర్టుల్లో నిలిచిపోయిన ఓడలకు డెమరేజ్ చార్జీలు వేయవద్దని కేంద్రం పోర్టు అధికారులను ఆదేశించింది.