మనోళ్లు పంపే డబ్బుపైనా యుద్ధం దెబ్బ!
ABN , Publish Date - Mar 06 , 2026 | 04:18 AM
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావం చమురు దిగుమతులు, విమానయానంపైనే కాదు.. గల్ఫ్ దేశాల నుంచి మనవాళ్లు ఇక్కడ ఉన్న తమవారికి పంపే డబ్బు....
విదేశాల నుంచి భారతీయులు 2025లో పంపిన సొమ్ము రూ.12 లక్షల కోట్లు
అందులో 38 శాతం గల్ఫ్ దేశాల నుంచి వచ్చిందే
యుద్ధం ఆరు నెలలకు మించి కొనసాగితే ఇండియా
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం: ఆర్థిక నిపుణులు హెచ్చరిక
న్యూఢిల్లీ, మార్చి 5: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావం చమురు దిగుమతులు, విమానయానంపైనే కాదు.. గల్ఫ్ దేశాల నుంచి మనవాళ్లు ఇక్కడ ఉన్న తమవారికి పంపే డబ్బు (రెమిటెన్స్)పైనా తీవ్రంగా పడనుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో అత్యధికంగా రెమిటెన్సెస్ అందుకునే దేశాల్లో అగర స్థానంలో భారత్ ఉంది. ఇలా వచ్చే సొమ్ము మన దేశ జీడీపీలో ఏకంగా 3.5 శాతం దాకా ఉంటుందని అంచనా. అమెరికాకు మనం చేసే ఎగుమతుల విలువ మన ఆర్థిక వ్యవస్థలో కేవలం 2శాతమే. అంటే.. అమెరికాకు మనం అమ్మే వస్తువుల కంటే.. ప్రపంచం నలుమూలలా ఉన్న మనవాళ్లు అక్కడ సంపాదించి ఇక్కడికి పంపే మొత్తమే ఎక్కువ! ముఖ్యంగా.. సౌదీ అరేబియా, కువైత్, ఖతార్, ఒమాన్ తదితర దేశాల్లో 90 లక్షల మంది కంటే ఎక్కువ మంది భారతీయులు ఉంటారు. ఆయా దేశాల నుంచి వారు ఇక్కడ ఉన్న తమవారికి పంపే సొమ్ము.. మన దేశ కరెంటు ఖాతా లోటును (ఎగుమతి చేసే వస్తువుల కన్నా దిగుమతయ్యే వస్తువులు ఎక్కువ. దీంతో ఏర్పడే ఆర్థిక లోటు) పూడ్చడంలో, మన విదేశీ మారక నిల్వలను స్థిరంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తోందనడంలో అతిశయోక్తి లేదు. భారతదేశానికి ఇలా ఏటా వచ్చే మొత్తం నిధుల్లో గల్ఫ్ దేశాల నుంచి వచ్చే సొమ్మే 38 శాతం దాకా ఉంటుందని ‘సిటీ’ గ్రూప్ తన తాజా ఆర్థిక నివేదికలో పేర్కొంది. అంతేనా.. గడిచిన కొన్ని సంవత్సరాలుగా భారత్‌కు వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కంటే.. రెమిటెన్స్‌లే ఎక్కువ. మనకు ఇలా వచ్చే నిధుల్లో అత్యధిక భాగం అమెరికా (27.7ు) నుంచి కాగా.. 18 నుంచి 20 శాతంతో యూఏఈ తర్వాతి స్థానంలో ఉంది. 2025లో మన దేశానికి ఇలా వివిధ దేశాల నుంచి మనవాళ్లు పంపిన మొత్తం సొమ్ము 135.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.12.4 లక్షల కోట్లు) కాగా.. అందులో గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన సొమ్మే 51.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.4.71 లక్షల కోట్లు). అదే 2025లో అమెరికాతో మన వాణిజ్య మిగులు దాదాపు రూ.5.33 లక్షల కోట్లు. గల్ఫ్ దేశాల్లో భారతీయులు ఎక్కువగా.. చమురు, సేవలు, నిర్మాణ, ఆతిథ్య, రిటైల్, పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తున్నారు.
ఇవన్నీ యుద్ధం వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యే రంగాలే. యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు పెరిగిపోయి.. చమురు కొనుగోళ్లకు ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి రావడం, అదే సమయంలో మనకు వచ్చే రెమిటెన్సెస్ తగ్గిపోవడం వల్ల ఇండియా ఆర్థిక నిల్వలపై తీవ్రంగా దెబ్బ పడుతుందని ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ ప్రధాన ఆర్థికవేత్త అలెగ్జాండ్రా హెర్మన్ హెచ్చరించారు. రూపాయిపై ఒత్తిడి పెరిగి బలహీనపడుతుందని పేర్కొన్నారు. ఈ పరిణామాలతో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యులపై ధరాభారం పడే ప్రమాదం ఉంది. అయితే, ఇదంతా తక్షణం జరగదని.. యుద్ధం సుదీర్ఘకాలంపాటు కొనసాగితే మాత్రమే ఆ ప్రభావం పడుతుందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘‘యుద్ధం కొంతకాలమే జరిగితే ఇది పెద్ద సమస్య కాదు. కానీ.. ఎక్కువకాలం కొనసాగితే గల్ఫ్‌దేశాల్లో నిర్మాణ, సేవారంగాల కార్యకలాపాలు నిలిచిపోయి అక్కడి భారతీయ కార్మికుల ఉపాధి దెబ్బతింటుంది. దీనివల్ల వారు పంపే సొమ్ము తగ్గిపోతుంది’’ అని అలెగ్జాండ్రా హెచ్చరించారు.
ఆర్నెల్లకు మించి కొనసాగితే..
ఎస్ అండ్ పీ గ్లోబల్ నిపుణురాలు దీపాకుమార్ విశ్లేషణ ప్రకారం.. కొన్నివారాలపాటు యుద్ధం కొనసాగడం వల్ల కలిగే నష్టాన్ని భారత్ ఇప్పటికే తన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వల ద్వారా పూడ్చగలదు. కొంతకాలంపాటు విదేశాల నుంచి వచ్చే డబ్బు తగ్గినా.. ఆ తర్వాత పరిస్థితి సర్దుకుంటుంది. భారత ఆర్థిక వ్యవస్థ దీన్ని తట్టుకోగలదు. కానీ, యుద్ధం ఆరు నెలలు, అంతకు మించి కొనసాగితే మాత్రం అలా చేయడం కష్టం. అప్పటికి మన వద్ద ఉన్న విదేశీ నిల్వలు వేగంగా కరిగిపోతుంటాయి. చమురు దిగుమతి బిల్లులు భారీగా పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దాన్ని తగ్గించడానికి ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచుతుంది. సామాన్యుల గృహ, వాహన రుణాల తాలూకూ నెలవారీ చెల్లింపుల మొత్తం పెరుగుతుంది. ఈ పరిణామాలన్నీ మన ఆర్థిక వ్యవస్థకు అగ్నిపరీక్షగా మారతాయి.