యుద్ధం మన పెరట్లోకి వచ్చేసింది!
ABN , Publish Date - Mar 06 , 2026 | 04:16 AM
యుద్ధం మన పెరట్లోకి ప్రవేశించింది. హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌకను ముంచేశారు. కానీ ప్రధాని నోరు మెదపడం లేదు.
ఇరాన్ నౌకను శ్రీలంక సమీపాన ముంచేశారు .. మన చమురు సరఫరాకూ ముప్పు
ఈ తరుణంలో దృఢచిత్తం గల నేత కావాలి
కానీ మోదీ లొంగిపోయారు: రాహుల్
ఇరాన్ నౌకను పేల్చేస్తే స్పందనేదీ: ఖర్గే
న్యూఢిల్లీ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ‘యుద్ధం మన పెరట్లోకి ప్రవేశించింది. హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌకను ముంచేశారు. కానీ ప్రధాని నోరు మెదపడం లేదు. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో భారతదేశానికి దృఢచిత్తం కలిగిన నేత సారథిగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ అమెరికాకు లొంగిపోయిన, రాజీపడిన మోదీ ప్రధానిగా ఉన్నారు’ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆక్షేపించారు. భారత వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని ఆయన తాకట్టుపెట్టారని గురువారం ‘ఎక్స్’లో ధ్వజమెత్తారు. భారత్‌కు చమురు సరఫరా ప్రమాదంలో పడిందని తెలిపారు. ‘మన దిగుమతుల్లో 40 శాతం హోర్ముట్ జలసంధి గుండానే రావాలి. ఎల్‌పీజీ, సీఎన్‌జీ సరఫరా పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది’ అని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం భారత వ్యూహాత్మక, జాతీయ ప్రయోజనాలకు తిలోదకాలిచ్చిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. భారత్‌కు అతిథిగా వచ్చిన ఇరాన్ నౌక.. మనం ఆతిథ్యం ఇచ్చిన ‘ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2026’లో పాల్గొని ఇంటికి తిరిగి వెళ్తుంటే.. హిందూమహాసముద్ర ప్రాంతంలో టార్పెడోతో పేల్చేశారు. దీనిపై మోదీ మూగవాడిగా ఉండిపోయారు. మన పెరట్లో జరిగిన ఘటనపై స్పందించనప్పుడు.. మహాసాగర్ సిద్ధాంతాలు, హిందూమహాసముద్ర ప్రాంతంలో భారత్ నెట్ సెక్యూరిటీ పవర్‌గా మారుతోందని మాకు ఉపన్యాసాలు ఇవ్వడమెందుకు? హోర్ముజ్ జలసంధి వద్ద 38 భారత వాణిజ్య నౌకలు, 1,100 మంది నావికులు చిక్కుకుని ఉన్నారు. కెప్టెన్ ఆశి్‌షకుమార్ సహా భారతీయ నావికులు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. క్రూడ్, చమురు నిల్వలు కేవలం 25 రోజుల వరకే ఉన్నాయని ప్రభుత్వమే చెబుతోంది.
ఓపక్క చమురు ధరలు పెరుగుతుంటే.. రష్యా నుంచి చమురు దిగుమతి నిలిపివేయాలన్న డిమాండ్‌కు భారత్ తలొగ్గిన తర్వాత.. ఇంధన భద్రతకు సంబంధించి అత్యవసర ప్రణాళికేంటి? గల్ఫ్ దేశాలకు ఎగుమతయ్యే ఇతర సరుకుల వాణిజ్యం సంగతేంటి? గల్ఫ్ ప్రాంతంలో కోటి మంది భారతీయలు ఉన్నారు. వైద్య విద్యార్థులు సాయం కోరుతూ వీడియో సందేశాలు పెడుతున్నారు. వారి రక్షణకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి?’ అని విమర్శించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తదితరుల హత్యపై మౌనం వీడని మోదీ ప్రభుత్వం.. ఇరాన్ నౌక విధ్వంసంపై స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించడం లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. ‘మిలాన్ 13వ ఎడిషన్ గత నెల 19 నుంచి 25 వరకు విశాఖపట్నంలో జరిగింది. ఇందులో అమెరికా, ఇరాన్ సహా ఇతర దేశాలకు చెందిన 18 యుద్థనౌకలు పాల్గొన్నాయి. ఇందులో పాల్గొని విశాఖపట్నం నుంచి స్వదేశానికి తిరిగి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌకను ఈ నెల 4న శ్రీలంకలోని గాలేకు 40నాటికల్ మైళ్ల దూరాన అమెరికా ముంచేసింది. దీనిపై ఇప్పటి వరకూ కేంద్రం నుంచి స్పందన లేకపోవడం దిగ్ర్భాంతి కలిగిస్తోంది’ అని పేర్కొన్నారు.