సానుకూల వార్తలను విస్మరిస్తే యువత ‘బొద్దింక’ల బాట!
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:16 AM
మీడియా సానుకూల వార్తలను విస్మరిస్తే.. యువత ‘బొద్దింక’ల బాట పడతారని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కీలక వ్యాఖ్యలు చేశారు..
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవహారంపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ వ్యాఖ్యలు
కొట్టాయం, మే 31: మీడియా సానుకూల వార్తలను విస్మరిస్తే.. యువత ‘బొద్దింక’ల బాట పడతారని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాలో సానుకూల వార్తలు, విజయగాథలకు అవకాశం లభించాలని..అలా జరగని పక్షంలో యువతపై ప్రభావం పడుతుందన్నారు. పరోక్షంగా కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు, సమాజానికి దిశానిర్దేశం చేసేందుకు నిర్మాణాత్మక జర్నలిజం అత్యంత అవసరమని నొక్కి చెప్పారు. కేరళ దిన పత్రిక ‘దీపిక’ 140వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాధాకృష్ణన్.. సానుకూల, అభివృద్ధి కార్యక్రమాలపై మీడియా ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించారు. తద్వారా యువతకు సరైన సమాచారం అందడంతోపాటు వారికి మీడియా ఆదర్శవంతంగా నిలుస్తుందన్నారు. అలాకాకపోతే.. యువత ఆసక్తిని కోల్పోయి.. ‘బొద్దింక’లను అనుసరిస్తారని తెలిపారు. ‘‘నేను భావ ప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకం కాదు. కానీ, కాల పరీక్షకు నిలబడలేని అంశాలపై అత్యంత ప్రాధాన్యం ఇవ్వడాన్నే ప్రశ్నిస్తున్నా.’’ అని వ్యాఖ్యానించారు. ఒక్క రోజులో ఒక విషయానికి ఇంత ప్రాధాన్యం అవసరమా? అంటూ.. సోషల్ మీడియాలో సీజేపీని అనుసరిస్తున్న వారిని పరోక్షంగా ఆయన నిలదీశారు. ఒక విషయం నిజంగానే మంచిదైతే.. ప్రజలు దానిని వారం, పది రోజులు, నెల తర్వాత కూడా గుర్తిస్తారని అన్నారు. ‘‘వారెవరో తెలీదు. అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు’’ అని పరోక్షంగా సీజేపీపై విమర్శలు గుప్పించారు.