వీఐటీ 597
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:58 AM
తమిళనాడులోని వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) యూనివర్సిటీ సత్తా చాటింది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ...
క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో 94 స్థానాలు పైకి
చెన్నై, జూన్ 19(ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) యూనివర్సిటీ సత్తా చాటింది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్- 2027లో 597వ స్థానంలో నిలిచింది. లండన్ కేంద్రంగా పనిచేసే ‘క్వాక్వారెల్లీ సైమండ్స్ (క్యూఎస్)’ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 1,500కు పైగా విశ్వవిద్యాలయాలను వివిధ అంశాల వారీగా విశ్లేషించి ఏటా ర్యాంకింగ్‌లు విడుదల చేస్తుంది. వీఐటీ గతేడాది సాధించిన 691వ ర్యాంకుతో పోలిస్తే తాజా జాబితాలో 94 స్థానాలు మెరుగుపడింది. ఈ విజయంపై వీఐటీ చాన్స్‌లర్ డాక్టర్ జి. విశ్వనాథన్ హర్షం వ్యక్తం చేశారు. తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ.. క్యూఎస్ వరల్డ్ ర్యాంకుల్లో వీఐటీ గణనీయమైన మెరుగుదల సాధించడం ఎంతో గర్వకారణమని అన్నారు. 2026లో సుస్థిరత విభాగంలో రాణించిన వీఐటీ ప్రపంచంలో 352వ స్థానం, భారత్‌లో 7వ స్థానాన్ని పొందిందని చెప్పారు. అలాగే ఇంజనీరింగ్, టెక్నాలజీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 119వ స్థానం, భారతీయ సంస్థల్లో 6వ ర్యాంకు దక్కించుకుందని తెలిపారు. పరిశోధనల్లో అద్భుతమైన పురోగతి ద్వారా టాప్-200 వర్సిటీల జాబితాలోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విశ్వనాథన్ వివరించారు.