Share News

విరాట్‌- అనుష్కల ఒక్క ఆర్డర్‌.. మారిన రెస్టారెంట్‌ తలరాత!

ABN , Publish Date - Sep 28 , 2026 | 05:47 AM

వ్యాపారం దెబ్బతిని రూ.18లక్షల అప్పుల్లో మునిగిపోయి, చేతులెత్తే స్థితికి చేరుకున్న ఓ చిన్న హోటల్‌ యజమానులను.. విరాట్‌ కోహ్లీ, అనుష్కశర్మ జంట కొనుగోలు చేసిన ఒక్క ఆర్డర్‌ రాత్రికిరాత్రే కోటీశ్వరులుగా మార్చేసింది.

విరాట్‌- అనుష్కల ఒక్క ఆర్డర్‌.. మారిన రెస్టారెంట్‌ తలరాత!

  • 18లక్షల అప్పుతో మూతపడే స్థితి నుంచి.. 2కోట్ల టర్నోవర్‌కు

  • 200 రెట్లు పెరిగిన వ్యాపారం!

  • ముంబైలోని చిన్న చోలేభటూరే షాపును నిలబెట్టిన జోడీ

ముంబై, సెప్టెంబరు 27: వ్యాపారం దెబ్బతిని రూ.18లక్షల అప్పుల్లో మునిగిపోయి, చేతులెత్తే స్థితికి చేరుకున్న ఓ చిన్న హోటల్‌ యజమానులను.. విరాట్‌ కోహ్లీ, అనుష్కశర్మ జంట కొనుగోలు చేసిన ఒక్క ఆర్డర్‌ రాత్రికిరాత్రే కోటీశ్వరులుగా మార్చేసింది. ముంబైలోని చెంబూర్‌ ప్రాంతంలో జస్పాల్‌సింగ్‌ ఖల్సా, మహేందర్‌సింగ్‌ ఖల్సా అనే ఇద్దరు సోదరులు 2021లో ‘ఢిల్లీ సే’ పేరిట చోలే భటూరే షాపు ప్రారంభించారు. మూడే మూడు టేబుళ్లు, తొమ్మిది కుర్చీలు ఉండేవి. అయితే, వ్యాపారం సక్రమంగా సాగక అప్పుల్లో కూరుకుపోయారు. ఇక లాభం లేదనుకుని షాపును మూసివేయాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌ అభిషేక్‌ ఉపమన్యు ఈ షాపులో చోలే భటూరే తిని బావుందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఆ పోస్టు చూసిన సినీనటి అనుష్కశర్మ, చోలే భటూరే ఇష్టపడే తన భర్త విరాట్‌ కోహ్లి కోసం దానిని తెప్పించాలని భావించింది. జూహులోని వారి ఇంటికి రెండు ప్లేట్ల భటూరే డెలివరీ చేయాలంటూ ఆమె ఇంటి నుంచి హోటల్‌కు ఫోన్‌ వచ్చింది. ఆ ఫోన్‌ కోహ్లీ ఇంటినుంచి వచ్చిందని తెలిసి షాక్‌ తిన్నారు. చివరకు 2022 అక్టోబర్‌ 5న వారింటికి స్వయంగా వెళ్లి డెలివరీ ఇచ్చారు. ఆరోజు అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘ఢిల్లీ లాంటి చోలే భటూరే రుచి ముంబైలో దొరికింది’’ అని పోస్టు పెట్టి సదరు రెస్టారెంట్‌ను ట్యాగ్‌ చేసింది.


అంతే.. పోస్టు పెట్టిన అరగంట నుంచే హోటల్‌ముందు వేలాదిగా జనం క్యూ కట్టారు. డిమాండ్‌ ఎంతలా పెరిగిందంటే.. ఒక్కరోజులోనే వారు వాడే శెనగల పరిమాణం 8 కేజీల నుంచి 100 కేజీలకు చేరుకుంది. అలా మూతపడే స్థితి నుంచి మొదలైన తమ ప్రయాణం.. ముంబైవ్యాప్తంగా 4 బ్రాంచీలకు విస్తరించిందని యజమానులు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు 125 కిలోల శెనగలు వాడుతూ.. 3వేలకు పైగా ప్లేట్లను విక్రయిస్తున్నారు. ఒకప్పుడు నెలకు రూ.లక్ష టర్నోవర్‌ కూడా కష్టంగా ఉన్న పరిస్థితి నుంచి.. ఏకంగా 200 రెట్లు పెరిగి నెలకు రూ.2కోట్ల వ్యాపారం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

Updated Date - Sep 28 , 2026 | 05:48 AM