Share News

లక్నో కోర్టు వద్ద రణరంగం

ABN , Publish Date - May 18 , 2026 | 02:35 AM

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని సివిల్‌ కోర్టు సముదాయం వెలుపల ఆదివారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాల మేరకు భారీ బందోబస్తు మధ్య దాదాపు 240 న్యాయవాదుల...

లక్నో కోర్టు వద్ద రణరంగం

  • 240కి పైగా లాయర్ల చాంబర్ల కూల్చివేత

  • పోలీసులపై న్యాయవాదుల రాళ్లదాడి

లక్నో, మే 17: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని సివిల్‌ కోర్టు సముదాయం వెలుపల ఆదివారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాల మేరకు భారీ బందోబస్తు మధ్య దాదాపు 240 న్యాయవాదుల చాంబర్లు, దుకాణాలను లక్నో మునిసిపల్‌ కార్పొరేషన్‌ బుల్డోజర్లతో నేలమట్టం చేయడం ఘర్షణకు దారితీసింది. అధికారుల చర్యను నిరసిస్తూ వందలాది మంది లాయర్లు వాగ్వాదానికి దిగారు. ఒకానొక దశలో సెక్యూరిటీ సిబ్బంది పైకి రాళ్లు రువ్వడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కోర్టు పరిసరాల్లోని దుకాణదారులు, వీధి వ్యాపారులు తమ షాపులను మూసేసి పరుగులు తీశారు. తమకు కనీసం నోటీసు ఇవ్వకుండా.. కట్టుబట్టలతో రోడ్డున పడేశారని, ఈ రోజు నుంచి బీజేపీకి ఓటు వేయబోమని సీఎం యోగి సామాజిక వర్గానికి చెందిన ఓ లాయర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిని అదుపుచేయడానికి పోలీసులు లాఠీచార్జ్‌ చేయాల్సి వచ్చింది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అధికారులు మధ్యాహ్నానికి కూల్చివేతల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. జిల్లా సెషన్స్‌ కోర్టు ప్రాంగణానికి సమీపంలో ప్రజారవాణా మార్గాలను ఆక్రమించి భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ అలహాబాద్‌ హైకోర్టు ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వాటిని తక్షణమే తొలగించాలంటూ లక్నో మునిసిపల్‌ కార్పొరేషన్‌ను ఆదేశించింది.

Updated Date - May 18 , 2026 | 02:35 AM