అదిరింది
ABN , Publish Date - May 05 , 2026 | 05:43 AM
నువ్వు డాక్టర్ కావాలి’... అని తండ్రి ఆదేశం! ‘కాదు, నాన్నా యాక్టర్‌నే అవుతా’... ఇది కుమారుడి పంతం! సినిమాలంటే విజయ్‌కి అంత పిచ్చి! 1974 జూన్ 22న చెన్నైలో జన్మించారు. తండ్రి...
పట్టుపడితే సాధించాల్సిందే
తిరస్కారాలు ఎదురైనా ముందుకే
తమిళ సినిమాల్లో సూపర్ సక్సెస్
రాజకీయ అరంగేట్రంలోనే అదుర్స్
ఇదీ విజయ్ జీవన ప్రస్థానం
‘కప్పు ముఖ్యం బిగిలూ’... అని తెరపై ‘విజిల్స్’ వేయించాడు! ‘అదిరింది’ అంటూ అభిమానులను అలరించాడు. ‘సర్కార్’ పేరుతో దుష్ట రాజకీయాలను తెరపై చీల్చి చెండాడు! ఇప్పుడు ఆయనే రాజకీయాల్లోకి వచ్చాడు! ఆరంభంలోనే అదరగొట్టాడు!
2 స్థానాల్లోనూ విజయ్ భారీ గెలుపు
టీవీకే అధినేత విజయ్ పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. తిరుచ్చిరాపల్లి (తూర్పు)లో 91,381 ఓట్లు సాధించిన ఆయన.. డీఎంకే అభ్యర్థిపై 27,416 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అదేవిధంగా పెరంబూరులో కూడా ఆయన డీఎంకే అభ్యర్థిపై ఏకంగా 53,715 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు.
- చెన్నై, ఆంధ్రజ్యోతి
‘బండ మొహం... హీరోగానే పనికిరాడు’ అని తిరస్కరించారు. అదే కుర్రాడు... తమిళనాట సూపర్ హీరో స్థాయికి ఎదిగాడు.
‘అతనికి రాజకీయాలు కొత్త. లాలీపాప్ కుర్రాడు’ అని గేలి చేశారు. కానీ, అతనే రాజకీయాల్లోనూ ‘హీరో’ అయ్యాడు.
రియల్ హీరోగా మారిన ఆ రీల్ హీరో పేరే... జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అలియాస్ ‘ఇళయ దళపతి’ విజయ్! అత్యంత ఆసక్తికరం, స్ఫూర్తిదాయకమైన విజయ్ జీవన ప్రస్థానమిది...
‘నువ్వు డాక్టర్ కావాలి’... అని తండ్రి ఆదేశం! ‘కాదు, నాన్నా యాక్టర్‌నే అవుతా’... ఇది కుమారుడి పంతం! సినిమాలంటే విజయ్‌కి అంత పిచ్చి! 1974 జూన్ 22న చెన్నైలో జన్మించారు. తండ్రి... సినీ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్. తల్లి... శోభ చంద్రశేఖర్! 1984 నుంచి 1988 వరకు విజయ్ బాల నటుడిగా ఆరు చిత్రాల్లో నటించారు. తమ ఏకైక కుమారుడైన విజయ్‌ని చంద్రశేఖర్ డాక్టర్‌ను చేయాలని కలలు కన్నారు. కానీ, విజయ్ దృష్టంతా సినిమాలపైనే ఉండేది. ఇంటర్ రోజుల్లోనే నటన లేదా దర్శకత్వం వైపు వెళ్తానని తెగేసి చెప్పారు. చంద్రశేఖర్ కోపగించుకుని ‘ఇంటి నుంచి వెళ్ళిపో’ అని గద్దించారు. తండ్రి మాటలను సీరియ్‌సగా తీసుకున్న విజయ్.. ఒక లేఖ రాసిపెట్టి వెళ్లిపోయారు. చివరికి విజయ్ ఇంటి సమీపంలోనే ఉండే ఒక థియేటర్‌లో సినిమాలు చూస్తూ కనిపించారు. ఇంటికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు.. డిగ్రీ పూర్తి చేస్తే సినీరంగంలో చేర్పిస్తామని హామీ ఇవ్వడంతో విజువల్ కమ్యూనికేషన్ డిగ్రీలో చేరారు.
అంత ఈజీ కాదు..
తండ్రి సినీ దర్శకుడే అయినప్పటికీ విజయ్‌కు మాత్రం తొలి చిత్ర అవకాశం అంత సులభంగా రాలేదు. తన బయోడేటాతో స్టూడియోల చుట్టూ తిరిగారు. తండ్రి కూడా కొడుక్కి తెలియకుండా ప్రయత్నాలు మొదలుపెట్టారు. నాడు పేరున్న దర్శకులందరికీ కుమారుడి ఫొటో చూపించి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రాధేయపడ్డారు. చివరకు సగం పెట్టుబడి పెడతామన్నా విజయ్‌ను హీరో చేసేందుకు ఏ నిర్మాతా ముందుకురాలేదు. పైగా సూటిపోటి మాటలతో గాయపరిచారు. చివరికి చంద్రశేఖర్ రూ.60 లక్షలు అప్పుతెచ్చి కొడుకు హీరోగా తానే ‘నాళయ తీర్పు’ అనే చిత్రాన్ని తీశారు. అది పరాజయం పాలైంది. తీవ్రంగా కుంగిపోయిన విజయ్... నెల రోజులు ఇంటికే పరిమితమయ్యారు. ఆ సమయంలో స్నేహితులు అండగా నిలిచారు. రెండో సినిమా తీసేందుకు ముందుకొచ్చారు. విజయ్ తమ ఇంటిని కుదువపెట్టారు. ఇందులో కెప్టెన్ విజయకాంత్ పైసా రెమ్యునరేషన్ తీసుకోకుండా అతిథి పాత్ర పోషించారు. ఆ చిత్రమే ‘సెందూరపాండి’. ఈ సినిమా సూపర్ హిట్! తర్వాత పట్టుదలతో విజయ్ రేయింబవళ్లు కష్టపడ్డారు. నటనతో పాటు డ్యాన్స్, కరాటే వంటి వాటిపై శిక్షణ తీసుకున్నారు. తన మూడో చిత్రం ‘రసిగన్’తో నిలదొక్కుకున్నారు. రెండేళ్లు వరుసగా మాస్ చిత్రాలతో ఊపేశారు. ‘పూవే ఉనక్కాగ’తో క్లాస్ హీరోగా మారారు. ‘కాదలుక్కు మరియాదై’, ‘ఖుషీ’, ‘గిల్లీ’, ‘పోకిరి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో స్టార్ హీరోగా అవతరించారు. ఇప్పటికి 68 చిత్రాల్లో నటించారు. 69వ చిత్రం ‘జన నాయగన్’.. సెన్సార్ వివాదంతో విడుదలకు నోచుకోలేదు.
వీరాభిమానితో వివాహం... విడాకులు!
విజయ్ తన వీరాభిమాని సంగీతను 1999 ఆగస్టు 25న వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు జేసన్ విజయ్! కుమార్తె దివ్య. విజయ్, సంగీత వివాహ జీవితం కూడా ‘విడాకుల’ ముందు నిలిచింది. ఎన్నికల ముందే ఇది వివాదాస్పదమైంది. విడాకుల కోసం సంగీత కోర్టుమెట్లెక్కారు.
- చెన్నై, ఆంధ్రజ్యోతి.
రాజకీయ అరంగేట్రం..
ఆది నుంచీ విజయ్‌కి రాజకీయాలపై మక్కువ ఎక్కువ. సినిమాల్లో తన పాత్రలతో దీనిపై స్పష్టమైన సంకేతాలు పంపేవారు. ప్రస్తుత రాజకీయాలు, నాయకుల తీరు, ప్రజా సమస్యలను నేపథ్యంగా ఉన్న పలు చిత్రాల్లో ఆయన కథా నాయకుడిగా నటించారు. 2009లో ‘విజయ్ మక్కల్ ఇయ్యక్కం’ పేరుతో అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసి, సేవా కార్యక్రమాలు చేపట్టి... దానిని రాజకీయ అరంగేట్రానికి తొలి మెట్టుగా ఎంచుకున్నారు. ఆ తర్వాత 2024 ఫిబ్రవరిలో ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) స్థాపించారు. ఇప్పుడు... ఎన్నికల్లో అనూహ్య విజయంతో తమిళనాడు ముఖ్యమంత్రి పీఠానికి చేరువయ్యారు!