Share News

నిశ్శబ్ద విప్లవం!

ABN , Publish Date - May 05 , 2026 | 04:23 AM

తమిళనాట విజయ్‌ విజ యం... అదొక నిశ్శబ్ద విప్లవం. అభిమానులే బలంగా, స్థిరమైన రాజకీయ వ్యూహాలే ధనంగా విజయ్‌ దూసుకెళ్లారు. ‘ఒకే ఒక్క చాన్స్‌’ అంటూ విజయ్‌ చేసిన ప్రచారం పెను తుఫానులా మారి..

నిశ్శబ్ద విప్లవం!

  • రాజకీయ ‘విజయానికి’ 17 ఏళ్ల కిందటే పునాది

(చెన్నై - ఆంధ్రజ్యోతి)

తమిళనాట విజయ్‌ విజ యం... అదొక నిశ్శబ్ద విప్లవం. అభిమానులే బలంగా, స్థిరమైన రాజకీయ వ్యూహాలే ధనంగా విజయ్‌ దూసుకెళ్లారు. ‘ఒకే ఒక్క చాన్స్‌’ అంటూ విజయ్‌ చేసిన ప్రచారం పెను తుఫానులా మారి.. సంప్రదాయ రాజకీయాలను, రెండు పార్టీల వ్యవస్థను తుడిచిపెట్టేసింది. విజయ్‌ తన పార్టీని రెండేళ్ల క్రితం ప్రకటించినా, తన రాజకీయాలకు మాత్రం 17 ఏళ్ల క్రితమే పునాదులు పడ్డాయి. ఆయన తన అభిమాన సంఘాలను 2009లో విజయ్‌ మక్కల్‌ ఇయక్కమ్‌ పేరిట సంఘటితం చేశారు. తొలినుంచీ సేవా కార్యక్రమాల వైపే విజయ్‌ నడించారు. విద్య, సంక్షేమం, స్థానిక సమస్యల వంటి విషయాల్లో సేవాభావం ప్రదర్శించారు. 2011లో విజయ్‌ మక్కల్‌ ఇయక్కమ్‌ అన్నాడీఎంకేకు మద్దతు ఇచ్చింది. ఒకరకం గా ఇది ఆయన చేసిన చేసిన తొలి రాజకీయ ప్రయో గం. ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం. 2021లో మక్కల్‌ ఇయక్కమ్‌ సభ్యులు స్వతంత్రంగా స్థానిక సం స్థల ఎన్నికల్లో నిలిచి అత్యధికం గెలిచారు. విజయ్‌కి ఉ న్న పలుకుబడి ఓట్ల కిందకు మారుతోందని గుర్తించిన మరో సందర్భం ఇది. చివరికి 2024 లోక్‌సభ ఎన్నికల ముందు పూర్తి స్పష్టతతో విజయ్‌ పార్టీని ప్రకటించారు.

ప్రత్యామ్నాయం.. సానుభూతి

డీఎంకే-అన్నాడీఎంకేలపై విపరీతమైన అవినీతి ఆరోపణలున్నాయి. అయినా మరో సరైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో తమిళులు ఆ రెండు పార్టీల్లోనే ఏదో ఒకదానిని ఎన్నుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో... మంచి పరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తానన్న విజయ్‌ ప్రకటన, నిశ్శబ్దంగా ఓటర్లు ఆ పార్టీ వైపు మొగ్గడానికి కారణమైందని విశ్లేషిస్తున్నారు. మరోవైపు విజయ్‌ సభలకు స్టాలిన్‌ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని, పోలీసుల ద్వారా ఆయనను ఇబ్బంది పెడుతోందంటూ జరిగిన ప్రచారం కూడా సానుభూతి పెంచింది. కరూర్‌లో జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం డీఎంకేయేనని, విజయ్‌కు చెక్‌ పెట్టేందుకు డీఎంకే పన్నిన కుట్ర అని ప్రజలు గట్టిగా విశ్వసించారు. ఆ ఘటనలో మృతుల కుటుంబాలకు తలా రూ.1 కోటి, క్షతగాత్రులకు పెద్ద మొత్తం ఇవ్వడంతో బాధిత కుటుంబాలు విజయ్‌కు అండగా నిలిచాయి. అదే విధంగా ‘జన నాయగన్‌’ చిత్రం విడుదలను డీఎంకే అడ్డుకుందని, ఆన్‌లైన్‌లో లీక్‌ చేయడంలోనూ అధికార పార్టీ ప్రమేయం ఉన్నదన్న ప్రచారం ఓటర్లపై బాగా ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది.


సింగిల్‌ టార్గెట్‌..

పార్టీ పెట్టినప్పటినుంచీ తనకు, తన పార్టీకి ప్రధాన ప్రత్యర్థి డీఎంకే మాత్రమేనని విజయ్‌ స్పష్టంగా ప్రకటించారు. బీజేపీని సైద్ధాంతిక ప్రత్యర్థిగా పేర్కొన్నారు. మత రాజకీయాలను వ్యతిరేకిస్తానని, ‘లౌకిక, సామాజిక న్యాయం’ తన సిద్ధాంతం అన్న ఆయన మాటలు ఈ వర్గాలను ఆలోచించజేశాయి. ‘ఓటేయాలని మీ తల్లిదండ్రులకు గట్టిగా చెప్పండి’ అంటూ విజయ్‌ చేసిన విజ్ఞప్తి చిన్నారులపై బాగా ప్రభావం చూపింది. విజయ్‌కు ఉన్న స్టార్‌ హోదా, ఆయన పట్ల ఉన్న జనాకర్షణ ఆయన విజయంలో కీలకంగా మారాయి. ఒకవేళ విజయ్‌ సామాన్య రాజకీయ నేతలా వీధుల్లోకి దిగి ప్రజలను కలుసుకుని ఉంటే, ఆయన స్టార్‌డమ్‌కు ఉన్న ఆకర్షణ తగ్గిపోయేది. కానీ టీవీకే వ్యూహకర్తలు అలా జరగనివ్వలేదు. రాజకీయాల్లో కూడా విజయ్‌ను అగ్రతారగానే ఉంచి, దూరంగా ప్రచారం చేయించారు.

Updated Date - May 05 , 2026 | 04:23 AM