ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితం
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:44 AM
మరో వారం రోజుల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ‘తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ సంపూర్ణ మ్యానిఫెస్టోను విడుదల చేశారు.
నెలకు 200 యూనిట్ల విద్యుత్ కూడా.. గృహిణులకు ప్రతినెలా రూ.2500
పేద యువతుల పెళ్లికి 8 గ్రాముల బంగారం కానుక
వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.10వేలు
రైతులకు రుణ మాఫీ: విజయ్
టీవీకే మ్యానిఫెస్టో విడుదల
చెన్నై, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): మరో వారం రోజుల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ‘తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ సంపూర్ణ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు వంటగ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల విద్యుత్ ఉచితం, నిరుపేద యువతుల వివాహానికి 8 గ్రాముల బంగారం తదితర హామీలను ప్రకటించారు. ఇప్పటి వరకూ దశల వారీగా ఒక్కో వర్గానికి హామీలను గుప్పించిన విజయ్.. గురువారం ఓ స్టార్ హోటల్లో ఆదర్శ రైతు, ఆటోడ్రైవర్ తదితరులతో కలిసి, ఎంపిక చేసిన పార్టీ నేతల నడుమ తమ పార్టీ సంపూర్ణ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ తిరుక్కురళ్ గ్రంథంలో పేర్కొన్నట్లుగా మానవ జీవనానికి అవసరమైన అరం(ధర్మం), పొరుళ్(వస్తువులు), ఇన్బమ్(సంతోషం)అంశాలతో మ్యానిఫెస్టోను రూపొందించినట్లు ప్రకటించారు. అమలుకు సాధ్యమయ్యే హామీలనే మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్లు వివరించారు.
టీవీకే ప్రధాన హామీలు ఇవీ..
అర్హులైన పేద కుటుంబానికి ఏడాదికి ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు. 60 ఏళ్లలోపు వయసు కలిగి, కుటుంబాన్ని పోషించే గృహిణుల బ్యాంక్ ఖాతాల్లో ప్రతినెలా రూ.2500 జమ. నిరుపేదల యువతులకు వివాహం సందర్భంగా 8గ్రాముల బంగారం కానుక. ప్లస్-2దాకా విద్యార్థుల విద్యాభ్యాసం సాఫీగా సాగేందుకు వారి తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ఏటా రూ.15వేలు. ప్లస్-2 తర్వాత పీహెచ్‌డీ వరకు చదివే విద్యార్థులకు వడ్డీ లేకుండా రూ.20 లక్షల దాకా విద్యారుణం. 29 ఏళ్లకుపైగా నిరుద్యోగులుగా ఉన్న పట్టభద్రులకు ప్రతినెలా రూ.4000, ప్లస్-2 చదివిన వారికి రూ.2500 చెల్లింపు. విద్యార్థుల కోసం 100 కామరాజర్ స్పెషల్ స్కూళ్ల ఏర్పాటు. ఐదెకరాల కంటే తక్కువ భూములున్న రైతులు సహకార బ్యాంకుల్లో పొందిన పంట రుణాలు పూర్తిగా మాఫీ, అన్ని జిల్లాల్లో రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితం. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.10వేలు. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల దాకా ఆరోగ్య బీమా. వరికి క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.3500. చెరకు టన్నుకు రూ.4500 మద్దతు ధర.
విజయ్‌ను డీఎంకే తక్కువగా అంచనా వేస్తోంది: అళగిరి కుమార్తె కయల్ విళి
తమిళనాడులో డీఎంకే మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితులున్నాయని, అయితే ఆ కూటమి విజయాన్ని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్ చీల్చే ఓట్లు అడ్డుకునే అవకాశముందని స్టాలిన్ సోదరుడు, కేంద్ర మాజీమంత్రి ఎంకే అళగిరి కుమార్తె కయల్‌విళి అభిప్రాయపడ్డారు. విజయ్ పార్టీతో డీఎంకే విజయానికి ముప్పు పొంచివుందని హెచ్చరించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కయల్‌విళి మాట్లాడుతూ.. విజయ్‌ను డీఎంకే తక్కువగా అంచనా వేస్తోందని వ్యాఖ్యానించారు. అయితే, తాను డీఎంకేకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదని వివరణ ఇచ్చారు. డీఎంకే మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపించినా, విజయ్ రాకతో ఆ పరిస్థితి తారుమారైపోయిందన్నారు. ఈ ఎన్నికల్లో విజయ్ ప్రభావం ఉంటుందని, హంగ్ ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో డీఎంకే సీనియర్ల అనుభవాన్ని ఉపయోగించుకోవాలని స్టాలిన్‌కు కయల్‌విళి సూచించారు.