వయాగ్రా తరహా మందుతో అల్జీమర్స్‌కు అడ్డుకట్ట!
ABN , Publish Date - Nov 23 , 2026 | 02:38 AM
అంగస్తంభన సమస్యకు వాడే వయాగ్రా లాంటి ఔషధం.. అల్జీమర్స్‌కు అడ్డుకట్ట వేయగలదా? ఈ ప్రశ్న శాస్త్రజ్ఞుల్లో చాలాకాలంగా ఉంది. దీనికి సమాధానం వెతికేందుకు చాలా మంది పరిశోధకులు చాలాకాలంగా ప్రయోగాలు చేస్తున్నారు కూడా.
అంగ స్తంభన లోపానికి ఉపయోగించే మందు లాంటి ఏఆర్ 1001 అనే ఔషధంతో ప్రయోగం
13 దేశాలకు చెందిన 1535 మంది రోగులపై దక్షిణ కొరియా సంస్థ క్లినికల్ ట్రయల్స్
చెప్పుకోదగ్గ ఫలితాలు వచ్చినట్లు వెల్లడి
న్యూఢిల్లీ, నవంబరు 22: అంగస్తంభన సమస్యకు వాడే వయాగ్రా లాంటి ఔషధం.. అల్జీమర్స్‌కు అడ్డుకట్ట వేయగలదా? ఈ ప్రశ్న శాస్త్రజ్ఞుల్లో చాలాకాలంగా ఉంది. దీనికి సమాధానం వెతికేందుకు చాలా మంది పరిశోధకులు చాలాకాలంగా ప్రయోగాలు చేస్తున్నారు కూడా. ఈ క్రమంలోనే.. వయాగ్రా తరహాలో (పీడీఈ5 ఇన్హిబిటర్‌గా) పనిచేసే ఏఆర్1001 అనే ఔషధం కాస్తంత చెప్పుకోదగ్గ ఫలితాలను ఇస్తున్నట్టు మానవులపై జరిగిన క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైంది. దక్షిణకొరియాకు చెందిన ఏఆర్‌ఐబయో అనే కంపెనీ అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన ‘19వ క్లినికల్ ట్రయల్స్ ఆన్ అల్జీమర్స్ డిసీజ్’ సదస్సులో ఈ వివరాలను వెల్లడించింది. ఆ సంస్థ తెలిపినదాని ప్రకారం.. మానవులపై మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా 13 దేశాల నుంచి అల్జీమర్స్ తొలిదశలో ఉన్న 1535 మంది పేషెంట్లను ఎంచుకుని వారిలో అప్పటికి అల్జీమర్స్‌కు అసలు ఏ మందూ వాడని 604 మందిని ఒక గ్రూపుగా, అప్పటికే అల్జీమర్స్ మందులు వాడుతున్న 931 మందిని మరో గ్రూపుగా విభజించారు. రెండు గ్రూపుల్లోనూ కొందరికి రోజూ 30 మిల్లీగ్రాముల ఏఆర్1001 ఔషధాన్ని, మరికొందరికి ప్లాసిబో (ఉత్తుత్తి మాత్ర)ను ఇచ్చారు. ఆసక్తికరంగా.. అసలు ఏ అల్జీమర్స్ మందూ వాడకుండా కేవలం ఏఆర్1001 మాత్రమే వాడినవారిలో అల్జీమర్స్ లక్షణాలు తీవ్రతరం కావడాన్ని 31శాతం మేర తగ్గించినట్టు వెల్లడైంది. మిగతావారిలో మాత్రం ఏ తేడా కనపడకపోవడం గమనార్హం. అంగస్తంభన వైఫల్యాన్ని నివారించడానికి వాడే పీడీఈ5 ఇన్హిబిటర్లు.. శరీరంలో ఉండే సీజీఎంపీ అనే ఒక కెమికల్ మెసెంజర్‌ను విచ్ఛిన్నం చేసే ఒక ఎంజైమ్‌ను అడ్డుకుంటాయి. దీనివల్ల శరీరంలో సీజీఎంపీ స్థాయులు పెరిగి రక్తనాళాల చుట్టూ ఉన్న కండరాలు విశ్రాంతి స్థితిలోకి వెళ్తాయి.
ఫలితంగా రక్తనాళాలు వ్యాకోచం చెంది రక్తప్రసరణ పెరుగుతుంది. ఇదే సీజీఎంపీ.. మెదడులోని కణాలు ఒకదాంతో మరొకటి సమాచారం పంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సీజీఎంపీ స్థాయులు ఎక్కువగా ఉంటే కణాలు సమాచార సరఫరా సమర్థంగా చేసుకుంటాయి. అందుకే ఈ ఏఆర్1001 అనే పీడీఈ5 ఇన్హిబిటర్‌పై దక్షిణ కొరియా సంస్థ ట్రయల్స్ నిర్వహించింది. అంతకుముందు ఎలుకలపై నిర్వహించిన ట్రయల్స్‌లో కూడా ఈ ఔషధం సత్ఫలితాలను ఇచ్చిందని.. అల్జీమర్స్‌కు కారణమయ్యే అమిలాయిడ్ బీటా, టౌ ప్రొటీన్ల స్థాయులను గణనీయంగా తగ్గించిందని ఆ సంస్థ వెల్లడించింది.