Share News

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత

ABN , Publish Date - Aug 22 , 2026 | 05:05 AM

సీనియర్‌ సినీ నటి ‘షావుకారు’ జానకి(94) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పాటు, తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న జానకి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత

  • కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో పోరాటం

  • చెన్నైలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన నటి

  • 75 ఏళ్లలో 400కు పైగా సినిమాల్లో నటించిన జానకి

  • నలుగురు సీఎంలతో నటించిన ఘనత ఆమె సొంతం

  • నాలుగేళ్ల క్రితం వరించిన పద్మశ్రీ పురస్కారం

  • చివరి శ్వాస వరకూ నటించాలనుకున్న జానకి

1955లో వచ్చిన కన్యాశుల్కం సినిమాలో బాల వితంతువు బుచ్చమ్మగా ఆంక్షల మధ్య నలిగిపోయే పాత్రలో కళ్లతోనే ఆమె పలికించిన అమాయకత్వం, ఆర్తిని ఎవరు మరిచిపోగలరు? అంతకు ఐదేళ్ల ముందు తొలి చిత్రం షావుకారు సినిమాలో ఎన్టీఆర్‌ సరసన సబ్బులుగా ఒదిగిపోయిన తీరు.. అక్కాచెల్లెలు సినిమాలో పాండవులు పాండవులూ తుమ్మెద అంటూ వేసిన స్టెప్పులూ ఆమెను తలచుకోగానే మదిలో మెదలుతాయి! బతుకుదెరువు కోసం నటనారంగాన్ని ఎంచుకొని ఉండొచ్చు.. కానీ, ఆ తర్వాత తనదైన నటనతో నటనారంగాన్నే వేలు పట్టుకొని నడిపించారామె! శంకరమంచి జానకిగా తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే తన ఇంటి పేరును షావుకారుగా మార్చుకొని.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించిన జానకి ఇక లేరు!

చెన్నై, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): సీనియర్‌ సినీ నటి ‘షావుకారు’ జానకి(94) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పాటు, తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న జానకి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 1.59 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయాన్ని స్థానిక తేనాంపేటలోని స్వగృహంలో వుంచారు. సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం శనివారం మధ్యాహ్నం వరకు ఆమె భౌతికకాయాన్ని అక్కడే వుంచి, ఆదివారం అంత్యక్రియలు చేయనున్నట్లు షావుకారు జానకి మనవరాలు వైష్ణవి భర్త అరవింద్‌ మీడియాకు వెల్లడించారు.


జానకికి ఇద్దరు కుమార్తెలు యజ్ఞప్రభ, సచీరావ్‌, కుమారుడు వెంకటరమణ శంకరమంచి వున్నారు. అదే విధంగా నలుగురు మనవలు, మరో నలుగురు మునిమనవళ్లు ఉన్నారు. ఇందులో మనవరాలు వైష్ణవి అరవింద్‌ సినీరంగంలో స్థిరపడ్డారు. షావుకారు జానకి సోదరి దివంగత కృష్ణకుమారి కూడా ఒకప్పుడు వెండితెరపై ప్రముఖ కథానాయికగా రాణించిన విషయం తెలిసిందే. ఇదిలా వుండగా జానకి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం ప్రకటించారు.

Updated Date - Aug 22 , 2026 | 05:08 AM