Share News

ధరల పెరుగుదలను ప్రజలు అర్థం చేసుకోవాలి

ABN , Publish Date - May 27 , 2026 | 03:52 AM

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో దేశప్రజలు అర్థం చేసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు.

ధరల పెరుగుదలను ప్రజలు అర్థం చేసుకోవాలి

  • ‘అప్నాపన్‌’ పుస్తకావిష్కరణలో వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ, మే 26 (ఆంధ్రజ్యోతి) : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో దేశప్రజలు అర్థం చేసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధాన్ని ట్రంప్‌ ప్రారంభించారని, ఈ యుద్ధం వల్ల ఇంధన ధరల పెరుగుదలతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. మంగళవారం కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ రాసిన ‘అప్నాపన్‌: మై ఎక్స్‌పీరియెన్సెస్‌ విత్‌ నరేంద్ర మోదీ’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ ప్రధాని దేవగౌడ, వెంకయ్యనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘అప్నాపన్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ‘‘ఇంధన ధరల పెంపుపై ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకోవడానికి బదులుగా అసలు కారణాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి.’’ అని కోరారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో హామీ ఇస్తున్న ఉచితాల సంస్కృతిపై వెంకయ్యనాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి తెలియకుండానే ఉచితాలను ప్రకటించడం తగదని, తాను ఉచితాలకు పూర్తి వ్యతిరేకమని అన్నారు. అయితే సామాన్యుల ఆరోగ్యం, విద్య విషయంలో సమర్థిస్తానని స్పష్టం చేశారు. కాగా, ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఏపీ మంత్రి నారా లోకేష్‌ హాజరయ్యారు.

Updated Date - May 27 , 2026 | 03:52 AM