Share News

రాజ్యసభ సభ్యులుగా వేం, సింఘ్వీ ప్రమాణం

ABN , Publish Date - Apr 17 , 2026 | 03:52 AM

తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వేం నరేందర్‌ రెడ్డి, అభిషేక్‌ మను సింఘ్వీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్‌లోని రాజ్యసభ హాల్‌లో చైర్మన్‌ సీపీ రాధాకృష్ణన్‌ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

రాజ్యసభ సభ్యులుగా వేం, సింఘ్వీ ప్రమాణం

  • సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల హాజరు

  • రాష్ట్ర ప్రభుత్వం తరఫున పార్లమెంటులో పోరాడతా

  • తెలంగాణ ప్రజలకు ఎల్లవేళలా సేవ చేస్తా: నరేందర్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వేం నరేందర్‌ రెడ్డి, అభిషేక్‌ మను సింఘ్వీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్‌లోని రాజ్యసభ హాల్‌లో చైర్మన్‌ సీపీ రాధాకృష్ణన్‌ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత అభిషేక్‌ మను సింఘ్వీ దేవుడిపై ప్రమాణం చేస్తూ హిందీలో ప్రమాణం చేశారు. అనంతరం వేం నరేందర్‌రెడ్డి భగవంతుడిపై విశ్వాసం చూపుతూ ఇంగ్లిష్‌లో ప్రమాణం చేశారు. వీరితోపాటు బిహార్‌ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ (బీజేపీ), శివేశ్‌ కుమార్‌(బీజేపీ), ఉపేంద్ర కుశ్వాహా(ఆర్‌ఎల్‌ఎం), రాంనాథ్‌ ఠాకూర్‌(జేడీయూ), అసోం నుంచి తేరాష్‌ గోవల్ల(బీజేపీ), జొజెన్‌ మోహన్‌(బీజేపీ), ప్రమోద్‌ బోరో(యూపీపీ ఎల్‌), ఛత్తీస్‌గఢ్‌ నుంచి లక్ష్మీవర్మ(బీజేపీ), దేవి నేతం(కాంగ్రెస్‌), హరియాణా నుంచి కరంవీర్‌ సింగ్‌ బోధ్‌(కాంగ్రెస్‌), సంజయ్‌ భాటియ(బీజేపీ), హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి అనురాగ్‌ శర్మ(కాంగ్రెస్‌), మహారాష్ట్ర నుంచి వినోద్‌ శ్రీధర్‌ తావ్డే(బీజేపీ), ఒడిసా నుంచి సుజీత్‌ కుమార్‌ (బీజేపీ) రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. నూతన సభ్యులకు రాజ్యసభ చైర్మన్‌ సీపీ రాధాకృష్ణన్‌ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, వేం నరేందర్‌రెడ్డి, అభిషేక్‌ మనుసింఘ్వీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్‌ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, సీతక్కతోపాటు ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, కాంగ్రెస్‌ నేతలు హాజరయ్యారు. నూతన రాజ్యసభ సభ్యులకు అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకారం తర్వాత తెలంగాణ భవన్‌కు వచ్చిన నరేందర్‌రెడ్డికి శుభాకాంక్షలు చెప్పేందుకు నాయకులు పోటీ పడ్డారు. తెలంగాణ హక్కుల సాధనకు కృషి చేస్తానని ఎంపీ వేం నరేందర్‌ రెడ్డి తెలిపారు. తనకు అవకాశం కల్పించిన సోనియా, రాహుల్‌ గాంధీ, రేవంత్‌రెడ్డితోపాటు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యలు, రాష్ట్ర హక్కులు, నిధుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం తరఫున పార్లమెంట్‌లో పోరాడతానని అన్నారు. కాంగ్రెస్‌ నమ్మకాన్ని నిలబెడతానని, తెలంగాణ ప్రజలకు ఎల్లవేళలా సేవ చేస్తానని చెప్పారు.

Updated Date - Apr 17 , 2026 | 03:52 AM