Share News

20 మందితో సతీశన్‌ క్యాబినెట్‌

ABN , Publish Date - May 18 , 2026 | 02:43 AM

కేరళ సీఎంగా సోమవారం ప్రమాణం చేయనున్న వీడీ సతీశన్‌ తన మంత్రివర్గ సభ్యుల పేర్లను వెల్లడించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..

20 మందితో సతీశన్‌ క్యాబినెట్‌

  • కేరళ సీఎంగా నేడు సతీశన్‌ ప్రమాణ స్వీకారం

తిరువనంతపురం, మే 17: కేరళ సీఎంగా సోమవారం ప్రమాణం చేయనున్న వీడీ సతీశన్‌ తన మంత్రివర్గ సభ్యుల పేర్లను వెల్లడించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకునే వారి జాబితాను ఖరారు చేసినట్లు చెప్పారు. మొత్తం 20 మందితో మంత్రివర్గం ఏర్పాటు కానుండగా అందులో 14 మంది తొలిసారిగా బాధ్యతలు చేపట్టనున్నవారే కావడం గమనార్హం. మంత్రుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు ఎస్సీలు ఉండనున్నారు. సామాజిక, ప్రాంతీయ, మిత్రపక్షాల సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని మంత్రులను ఎంపిక చేసినట్లు సతీశన్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రమేశ్‌ చెన్నితాల, మురళీధరన్‌, కేపీసీసీ చీఫ్‌ సన్నీ జోసెఫ్‌లను మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు చెప్పారు. సీనియర్‌ ఎమ్మెల్యే తిరువంచూర్‌ రాధాకృష్ణన్‌ను స్పీకర్‌గా, షనిమోల్‌ ఉస్మాన్‌ను డిప్యూటీ స్పీకర్‌గా నియమించాలని యూడీఎఫ్‌ నిర్ణయించిందని వివరించారు. గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న ఐయూఎంఎల్‌ సీనియర్‌ నాయకుడు పి.కె.కున్హలికుట్టి, ఆర్‌ఎస్పీ నాయకుడు శిబు బాబీ జాన్‌, కేరళ కాంగ్రెస్‌ నాయకుడు మోన్స్‌ జోసెఫ్‌, కేరళ కాంగ్రెస్‌ (జాకోబ్‌)కు చెందిన అనూప్‌ జాకోబ్‌లకు మళ్లీ పదవులు దక్కాయి. కాంగ్రెస్‌ 63 సీట్లలోనే గెలిచినందున చాలా మంది ఆశావహులకు మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోతున్నట్లు తెలిపారు. యూడీఎఫ్లో కీలక భాగస్వామి అయిన ఐయూఎంఎల్‌కు 5 మంత్రి పదవులు దక్కాయి. సోమవారం సతీశన్‌తో పాటు 20 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్‌ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు.

Updated Date - May 18 , 2026 | 02:43 AM