కేరళ సీఎంగా సతీశన్
ABN , Publish Date - May 15 , 2026 | 04:20 AM
కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. 10 రోజుల సుదీర్ఘ ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్ సీనియర్ నేత వి.డి. సతీశన్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది.
10 రోజుల ఉత్కంఠకు తెర.. ప్రజల్లో బలమున్న నేతవైపే మొగ్గు
చివరిదాకా రేసులో కేసీ, రమేశ్ చెన్నితాల.. 18న ప్రమాణం
న్యాయవాది నుంచి సీఎం దాకా.. వరుసగా 6 సార్లు ఎమ్మెల్యే
కేరళ ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం: సతీశన్
అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా: కేసీ వేణుగోపాల్
న్యూఢిల్లీ, తిరువనంతపురం, మే 14: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. 10 రోజుల సుదీర్ఘ ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్ సీనియర్ నేత వి.డి. సతీశన్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. సీఎం పదవి కోసం కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితాల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ వారిద్దరినీ కాదని సతీశన్ వైపు మొగ్గు చూపింది. ప్రజల్లో బలం ఉన్న నేత కావడం, మిత్రపక్షాలైన ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ వంటి పార్టీల నుంచి కూడా ఆయనకే మద్దతు లభించింది. 45శాతం ముస్లిం ఓటర్లు ఉన్న వయనాడ్‌లో.. అక్కడ ఎంపీగా ఉన్న ప్రియాంకాగాంధీకి క్షేత్రస్థాయిలో ఐయూఎంఎల్ మద్దతు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో కూటమిలో ఉన్న మిత్రపక్షాన్ని నొప్పించడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూఢీఎఫ్ కూటమి 140 అసెంబ్లీ స్థానాలకు గాను, 102 చోట్ల ఘన విజయం సాధించింది. అయితే, పార్టీలోని 63మంది ఎమ్మెల్యేలలో 47మంది మద్దతుతో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ చివరివరకు రేసులో ఉన్నప్పటికీ అధిష్ఠానం ఆచితూచి అడుగు వేసింది. ఒకవేళ ఆయనను సీఎం పోస్టుకు ఎంపిక చేస్తే ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి రావడం, ఆరు నెలల్లో ఉప ఎన్నిక ఎదుర్కోవాల్సి ఉండటంతో హైకమాండ్ ఆలోచనలో పడింది. క్షేత్రస్థాయిలో సతీశన్‌కు ఉన్న ‘పీపుల్స్ చాయిస్’ ఇమేజ్, కేసీ వేణుగోపాల్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలో వెలసిన పోస్టర్లు, కార్యకర్తల ఆందోళనల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన్నే సీఎంగా ఖరారు చేసింది. ఎంపిక కోసం ఏఐసీసీ పరిశీలకులు జరిపిన అభిప్రాయసేకరణలో ఇదే విషయం వెల్లడైంది. కాగా, ముఖ్యమంత్రిగా సతీశన్ మే 18న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.
న్యాయవాది నుంచి సీఎం పీఠం వరకు
కేరళ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న 61ఏళ్ల సతీశన్.. సామాన్య కార్యకర్త నుంచి సీఎం స్థాయికి ఎదిగిన నేతగా గుర్తింపు పొందారు. వృత్తిరీత్యా కేరళ హైకోర్టులో న్యాయవాది అయినప్పటికీ.. లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తూనే సామాజిక అంశాలపై లోతైన అవగాహన పెంచుకున్నారు. ఎర్నాకుళం జిల్లా నెట్టూరులో జన్మించిన సతీశన్ రాజకీయ ప్రస్థానం కళాశాల దశలోనే ప్రారంభమైంది. ఎంజీ యూనివర్సిటీ నుంచి విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేసిన ఆయన.. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు చేపట్టి, కొచ్చి సమీపంలోని కమ్యూనిస్టుల కంచుకోట పరవూర్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2021లో యూఢీఎఫ్ ఓటమి పాలైనప్పటికీ రాహుల్ గాంధీ ప్రోత్సాహంతో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి సీఎం పినరయి విజయన్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేశారు. పదేళ్లలో ఎల్‌డీఎఫ్ పాలనపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.
అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా: కేసీ
సీఎం పదవికి ప్రధాన పోటీదారులలో చివరివరకు నిలిచిన వేణుగోపాల్ హైకమాండ్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. ‘నాకు వ్యక్తిగత ఇమేజ్ కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యం. ఒక విధేయుడైన కార్యకర్తగా సతీశన్ ప్రభుత్వానికి నా పూర్తి మద్దతు ఉంటుంది. కేరళలో సుస్థిరమైన, అవినీతి రహిత పాలన అందించడమే అందరి లక్ష్యం’ అని ఆయన స్పష్టం చేశారు. సీఎంగా ఎంపిక తర్వాత సతీశన్ తొలిసారి స్పందిస్తూ.. కేరళ ప్రజలు తనపై ఉంచిన బాధ్యతను అత్యంత నిబద్ధతతో నిర్వహిస్తానని తెలిపారు. హైకమాండ్ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, రాష్ట్ర అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని, సుపరిపాలన అందిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నేత శశి థరూర్ స్పందిస్తూ.. సతీశన్‌కు దక్కిన ఈ పదవి ఆయన పట్టుదలకు, పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతకు దక్కిన అరుదైన గుర్తింపు అని అభివర్ణించారు. సతీశన్ ఎంపికను కూటమిలో రెండో అఽతిపెద్ద భాగస్వామ్య పక్షమైన ఐయూఎంఎల్ హర్షించింది.