Vande Bharat Sleeper: వందేభారత్ స్లీపర్ రైలు సిద్ధం
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:06 AM
వందేభారత్ రైలు స్లీపర్ కోచ్‌లో ప్రయాణించాలన్న ప్రయాణికుల కోరిక త్వరలో తీరనుంది. వందే భారత్ స్లీపర్ కోచ్‌లతో కూడిన రైలును ప్రధాని మోదీ చేతుల మీదుగా తర్వలో ప్రారంభించనున్నట్లు రైల్వే మంత్రి...
గువాహటి - కోల్‌కతా మధ్య తొలి రైలు
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
న్యూఢిల్లీ, జనవరి 1: వందేభారత్ రైలు స్లీపర్ కోచ్‌లో ప్రయాణించాలన్న ప్రయాణికుల కోరిక త్వరలో తీరనుంది. వందే భారత్ స్లీపర్ కోచ్‌లతో కూడిన రైలును ప్రధాని మోదీ చేతుల మీదుగా తర్వలో ప్రారంభించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ట్రైల్ రన్, ఇతర పరీక్షలు అన్నీ పూర్తయ్యాయని తొలి స్లీపర్ రైలును గువాహటి-కోల్‌కతా మధ్య నడపనున్నామని ఆయన వివరించారు. ‘చాన్నాళ్లుగా కొత్త జనరేషన్ వందేభారత్ రైళ్ల కోసం ప్రయాణికుల నుంచి డిమాండ్ ఉంది. భారతీయ రైల్వేలో వందేభారత్ చైర్ కార్ రైళ్లతో కొత్త శకం ఆరంభమైంది. ఈ రైళ్లను ప్రజలు కూడా బాగా ఆదరిస్తున్నారు. వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకుని స్లీపర్ కోచ్‌లతో కూడిన వందేభారత్ రైళ్లను రూపొందించాం. అధునాతన భద్రతా ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయి స్లీపర్ కోచ్‌లతో ఈ రైళ్లను సిద్ధం చేశాం’ అని వైష్ణవ్ ఢిల్లీలో విలేకరులకు వివరించారు. టికెట్ ధరలు కూడా మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయిస్తున్నామని తెలిపారు. గువాహటి-హౌరా మధ్య ప్రయాణానికి 3ఏసీ టికెట్ ధర రూ.2300గా ఉండొచ్చని తెలిపారు. దేశంలో తొలి బుల్లెట్ రైలు ట్రైల్ రన్‌ను 2027 ఆగస్టు 15న నిర్వహిస్తామని వెల్లడించారు. ముందుగా సూరత్-బిలిమోరా మార్గంలో బుల్లెట్ రైలు సిద్ధమవుతుందని ఆయన పేర్కొన్నారు.