Share News

ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్‌

ABN , Publish Date - Oct 31 , 2026 | 03:07 AM

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం బద్రీనాథ్‌ నుంచి డెహ్రాడూన్‌కు బయలుదేరిన ఓ హెలికాప్టర్‌ ప్రతికూల..

ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్‌

  • పైలట్‌ సహా ఆరుగురి దుర్మరణం

  • బద్రీనాథ్‌ నుంచి తిరిగొస్తుండగా ఘటన

చమోలీ/బెంగళూరు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం బద్రీనాథ్‌ నుంచి డెహ్రాడూన్‌కు బయలుదేరిన ఓ హెలికాప్టర్‌ ప్రతికూల వాతావరణం కారణంగా జోషిమఠ్‌ పర్వత ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్‌తో పాటు కర్ణాటకలోని బెంగళూరు చెందిన ఐదుగురు ప్రయాణికులు మరణించారు. బద్రీనాథ్‌ నుంచి బయలుదేరిన గంట తర్వాత ఈ దుర్ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ప్రతికూల వాతావరణం నెలకొందని, ఆకాశం మేఘావృత్తమై ఉందని చెప్పారు. జోషిమఠ్‌ దగ్గర్లోని చాయీ గ్రామ సమీపంలో హెలికాప్టర్‌ కూలిపోయిన విషయాన్ని సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి తన ‘ఎక్స్‌’ పోస్టులో పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ (వీటీ-హెచ్‌సీఎక్స్‌)ను ట్రాన్స్‌ భారత్‌ ఏవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు చెందినదిగా, అందులో ప్రయాణిస్తున్న వారిని ఢిల్లీకి చెందిన కెప్టెన్‌ హిమాంశు సబర్వాల్‌(48), బెంగళూరుకు చెందిన స్నేహితులు ప్రతాప్‌ బీ నింగరాజు (41), అరుణ్‌ సాళుంకె(44), వీబీ శంకర్‌ గౌడ (39), కె.సుధీర్‌(49), హెచ్‌ఎస్‌ నటరాజ్‌ (51)గా గుర్తించారు. వీరిలో అరుణ్‌ సాళుంకె బెంగళూరు సీసీబీ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌. వీరంతా చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, 2015-25 మధ్య చార్‌ధామ్‌ సెక్టార్‌ పరిధిలో 8 హెలికాప్టర్‌ ప్రమాదాలు జరిగాయి.

Updated Date - Oct 31 , 2026 | 03:10 AM