Share News

యూపీలో 2 కోట్ల ఓట్లు హుష్‌!

ABN , Publish Date - Oct 22 , 2026 | 04:55 AM

దేశవ్యాప్తంగా సర్‌ ప్రక్రియ పూర్తైన 13రాష్ట్రాలు, 3కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ప్రాథమిక ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ప్రకటించింది.

యూపీలో 2 కోట్ల ఓట్లు హుష్‌!

న్యూఢిల్లీ, అక్టోబరు 21: దేశవ్యాప్తంగా సర్‌ ప్రక్రియ పూర్తైన 13రాష్ట్రాలు, 3కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ప్రాథమిక ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ప్రకటించింది. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం.. వార్షిక ప్రత్యేక రివిజన్‌ సమ్మరీ(ఎస్‌ఎ్‌సఆర్‌) కొనసాగుతోందని తెలిపింది. ఇది పూర్తైన తర్వాత ముసాయిదా జాబితాలను నవంబరు 12న ప్రకటించనున్నట్టు తెలిపింది. అయితే, డిసెంబరు 11 వరకు ఫిర్యాదులు, అభ్యంతరాలు తీసుకోనున్నారు. తుది జాబితాలను జనవరి 4న ప్రకటించనున్నారు. కాగా, అన్ని రాష్ట్రాల్లోనూ సర్‌ కారణంగా ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఉత్తరప్రదేశ్‌(యూపీ)లో 15.44 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. సర్‌ ప్రక్రియ తర్వాత 13.39 కోట్ల మంది మాత్రమే అర్హులుగా తేలారు. అంటే 2.05 కోట్ల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ప్రస్తుత జాబితాలో పంజాబ్‌లో 2.01 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. సర్‌ ప్రక్రియకు ముందు ఈ రాష్ట్రంలో 2.14 కోట్ల మంది ఉండడం గమనార్హం. దాదాపు 13.6 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. బిహార్‌లో 7.89 కోట్ల మంది ఓటర్లకుగాను తాజా జాబితాలో 7.42 కోట్ల మంది మాత్రమే మిగిలారు. పశ్చిమ బెంగాల్‌లో 83.86 లక్షల మంది ఓటు కోల్పోయారు. గతంలో 7.69 కోట్ల మందికి ఓటు హక్కు ఉండగా, తాజా జాబితాలో ఇది 6.86 కోట్లుగానే ఉంది. తమిళనాట.. 6.41 కోట్లకు గాను 5.67 కోట్ల మంది ఓటర్లే తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు. గుజరాత్‌లో 5.08 కోట్ల మంది ఓటర్లకుగాను సర్‌ ప్రక్రియ తర్వాత 4.40 కోట్ల మంది ఓటర్లే జాబితాలో ఉన్నారు. అంటే 68 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. కేరళంలో స్వల్పంగా 9 లక్షల ఓట్లు మాత్రమే గల్లంతయ్యాయి. ఇక్కడ మొత్తం 2.78 కోట్ల మంది ఓటర్లు ఉండగా సర్‌ తర్వాత 2.69 కోట్లుగా నమోదైంది. సర్‌పై ఆందోళనల వేళ ఎన్నికల సంఘం ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - Oct 22 , 2026 | 04:56 AM